మామిళ్లగూడెం, జూలై 26: ఇష్టంగా, ప్రణాళికాబద్ధంగా చదివితే గ్రూప్స్ ఉద్యోగాలు సాధించడం సులభమేనని విశ్రాంత ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) సీ.పార్థసారథి స్పష్టం చేశారు. కొలువు సాధించాలన్న కృషి, చదవాలని సూచించారు. ఇందుకు ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం ఎంతో ముఖ్యమని అన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గ్రూప్స్ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు మంగళవారం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన సదస్సు, ప్రేరణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తన విధి నిర్వహణ తాను చేస్తూనే.. పోటీ పరీక్షల సిద్ధమవుతున్న ఉద్యోగార్థులకు ప్రిపరేషన్‌పై అవగాహన కల్పించేందుకు పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ఉద్యోగార్థులకు ప్రేరణనిచ్చారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో గ్రూప్స్, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగులకు శిక్షణ పొందుతున్న 600కు పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సెంటర్ల అభ్యర్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ ఉద్యోగాలతోపాటు పోలీస్ ఉద్యోగాలను పెద్దఎత్తున భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేసిందని, తెలంగాణ ఏర్పాటైన ఈ ఎనిమిదేళ్లలో ఇంత పెద్దఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం ఇదే మొదటిసారని అన్నారు. కొలువుల జాతర ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాల్లోని యువత ఎలాగైనా ఉద్యోగాలు సాధించాలన్నట్లు చదువుతున్నారని అన్నారు. అయితే స్పష్టత లేకుండా చదవడం కంటే నిర్దిష్ట ప్రణాళికతో చదవడం ఎంతో ప్రధానమైన అంశమని అన్నారు. ఇందుకోసం దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమైనవని అన్నారు.
తాను కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగు మీడియంలోనే చదివి ఐఏఎస్ స్థాయికి ఎదిగానంటూ తన స్వీయ అనుభవాన్ని అభ్యర్థులకు వివరించారు. ‘రీడింగ్, రికార్డ్, రివిజన్’ అనే పద్ధతి అనుసరించాలని, 360 డిగ్రీల కోణంలో ప్రణాళికాబద్ధంగా చదవాలని వివరించారు. అనంతరం ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. ఇది ఒక మారథాన్ ప్రయాణమని, ఒడిదొడుకులు ఉంటాయని అన్నారు. అయినా సమర్థవంతంగా నడుచుకోవాలని సూచించారు. లక్ష్యంపై గురి పెట్టి సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభిలు శాలువాలతో సతరించారు. అంతకుముందు జిల్లాకు వచ్చిన ఎస్ఈసీకి కలెక్టర్, సీపీ, అదనపు కలెక్టర్లు, కేఎంసీ కమిషనర్ పూల మొకలు అందజేసి స్వాగతం పలికారు. సంక్షేమ శాఖల అధికారులు కస్తాల సత్యనారాయణ, జ్యోతి, మహమూది, కృష్ణానాయక్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.