మణుగూరు టౌన్, జూలై 24: గోదావరి వరదలకు భద్రాచలం పట్టణంతో పాటు బూర్గంపహాడ్, పినపాక, చర్ల, దుమ్ముగూడెం మండలాలు అత్యంత ప్రభావితమయ్యాయి. ముంపు బాధితులను ఆదుకోవడం, వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం, వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పినపాక నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. సాధారణ పౌరుడిలా పర్యటించి ప్రజల బాగోగులు చూసుకున్నారు. నియోజకవర్గంలో తీసుకుంటున్న సహాయక చర్యలను ప్రభుత్వ విప్ ‘నమస్తే’కు వెల్లడించారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
ముంపు ప్రాంత ప్రజల సమస్యల శాశ్వత పరిష్కారానికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని వరదల సమయంలో భద్రాచలం వచ్చి సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎత్తైన ప్రదేశాల్లో ఇండ్లు నిర్మిస్తామని, వరద ముప్పు నుంచి ప్రజలను కాపాడుకుంటామని సీఎం చేసిన ప్రకటనపై ప్రభుత్వ విప్ రేగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు రాగానే ముంపు ప్రాంతాల్లో అధ్యయనానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందేలా చూస్తామంటున్నారు.
రెండు నెలల పాటు 20 కిలోల చొప్పున రేషన్ బియ్యం, ఐదు కిలోల కందిపప్పు, మంచినూనెతో పాటు ఇతర నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ముంపు బాధితులు ఆదుకోవాలని సింగరేణి, ఐటీసీ ఉన్నతాధికారులతో పాటు ఇతర స్వచ్ఛంద సేవ సంస్థల ప్రతినిధులను కలిశారు. ముంపు బాధితులకు ఇతోధికంగా సాయం చేయాలని స్వయంగా వినతి పత్రాలు అందించారు. ఆయన చొరవతో ప్రస్తుతం ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, ఆహారం అందుతున్నది.
కరకట్టల నిర్మాణంపై దృష్టి..
బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లోని ముంపు ప్రాంతాలు ఏటా గోదావరి వరదల కారణంగా నీట మునుగుతున్నాయి. నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్, సీతారామ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ని తట్టుకునే విధంగా కరకట్టల నిర్మాణం కోసం కృషి చేస్తానని ప్రభుత్వ రేగా వెల్లడిస్తున్నారు. సీఎం సహకారంతో నదిలో కలిసే పెద్దవాగు, కిన్నెరసాని కోడిపుంజుల వాగు, అట్లవాగు తదితర ప్రాంతాల్లో కరకట్టలు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు.