భద్రాచలం/బూర్గంపహాడ్, జూలై 24: రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖా మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ‘స్మైల్ ఏ గిఫ్ట్’ కార్యక్రమంలో భాగంగా గోదావరి ముంపు బాధితులకు రూ.కోటి విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం భద్రాచలం, బూర్గంపహాడ్ మండలాలకు చెందిన 15వేల ముంపు బాధితుల కుటుంబాల ఇళ్ల వద్దకు వెళ్లి వాటిని స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఎన్నడూ లేనివిధంగా గోదావరి వరద 71.3అడుగులు మేర ప్రవహించడంతో ఎన్నో కుటుంబాలు నిరాశ్రమైనాయని, వారి అవస్థ చూడలేక వారి ఆకలిని తీర్చేందుకు తనవంతు సాయంగా సరుకులు అందజేసినట్లు పేర్కొన్నారు. వరద బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఓ వైపు జోరు వర్షం పడుతున్నప్పటికీ సరుకులు పంపిణీ చేయడం గమనార్హం.
నిత్యావసర సరుకుల కిట్లలో బియ్యం, కందిపప్పు, మంచినూనె, కారం, పసుపు, చింతపండు, ఉప్పు, పంచదార వంటి వాటిని అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావ్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, డాక్టర్ మట్టా దయానంద్, డాక్టర్ కోటా రాంబాబు, భద్రాచలం టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు అరికెల్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ, టీఆర్ఎస్ నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కడియం రామాచారి, తిరుపతిరావు, నక్కా ప్రసాద్, ఏసురెడ్డి, సానికొమ్ము శంకర్రెడ్డి, క్రాంతిరెడ్డి పాల్గొన్నారు.