ఆళ్లపల్లి, జూలై 22:వానకాలం వచ్చిందంటే చాలు.. ఆ మండల ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇక గర్భిణులు, రోగుల పరిస్థితి అగమ్యగోచరం. వర్షాలు కురవడం, వాగులు పొంగడం సర్వసాధారణం. అసలే మారుమూల ఏజెన్సీలో ఉన్న ఆ మండలంలో ఆదివాసీ ప్రజల దుస్థితి అంతా ఇంతా కాదు. ఒక్కోసారి వాగులు పొంగితే అవతలి ఒడ్డుకు చేరడానికి వారాల వ్యవధి పట్టే పరిస్థితి. అదే సమయంలో గర్భిణులకు పురుటి నొప్పులు వచ్చినా, రోగులకు ప్రాణాపాయ పరిస్థితి తలెత్తినా కాపాడుకోవడమే కత్తిమీద సాములాంటిది.
అయినా ధైర్యం చేసి వాగు దాటేందుకు ప్రయత్నించి కొట్టుకుపోయిన వారు ఎంతో మంది. ఇంకా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అంబులెన్స్ వచ్చేందుకు అనేక అడ్డంకులు. పీకల్లోతు వరదల్లో సాహసం చేసి దాటితేగానీ అంబులెన్స్‌ను అందుకునే అవకాశం. ఇదీ.. ఒకప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆళ్లపల్లి మండల దుస్థితి. కానీ ఇప్పుటి పరిస్థితి వేరు. తెలంగాణ ప్రభుత్వం సిద్ధించాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
రహదారులు, వంతెనలు నిర్మించడంతో రాకపోకలు సులువయ్యాయి. ప్రమాదాలు తప్పాయి. భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని ఇప్పనపల్లి, వలసల్ల, తునికిబండల, రామాంజిగూడెం, రాయిలంక, వెంకటాపురం, సింగారం, పెద్దురు, పాతూరు, చీమలగుంపు, సందింబంధం, నడిమిగూడెం, జాకరం, లొద్దిగూడెం సహా మరో 14 గ్రామాల ఆదివాసీ గిరిజన ప్రజలు కిన్నెరసాని, జల్లేరు, కోడెల వాగులకు వంతెనలు లేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడేవారు.
ఈ గ్రామాల ప్రజలు వాగులు దాటేటప్పుడు పడే కష్టాలు వర్ణనాతీతం. విద్యార్థులు చదువులకు, రైతులు వ్యవసాయ పనులకు సంబంధించిన ఎరువులు, విత్తనాల ప్యాకెట్ల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇక గర్భిణులు, బాలింతలకు అత్యవసరం అయితే వాగు దాటేందుకు నానా అవస్థలు పడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వంతెనల కోసం నిధులు మంజూరు చేసి వాటి నిర్మాణాలు పూర్తి చేయడంతో ఆదివాసీలు క్షేమంగా ఇళ్లకు చేరుకుంటున్నారు. ఎలాంటి అత్యవసర పని అయినా వంతెనల మీదుగా వెళ్లి వస్తున్నారు.
ఇంకా మండలంలో కర్నెగూడెం, సీతానగరం, చంద్రాపురం, బోడాయికుంట, అడవిరామవరం సహా మరికొన్ని గ్రామాలకు వంతెనలు అందుబాటులోకి తేవడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. త్వరలోనే అవి సిద్ధం కానున్నాయి. ఇక మండలంలోని 14 గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పోయాయి.
నిర్మాణం పూర్తయినవి ఇవే..
రామాంజిగూడెం పంచాయతీలోని 5 గ్రామాల కోసం జల్లేరు వాగుపై హైలెవెల్ వంతెన నిర్మించారు. రామాంజిగూడెం ఆర్అండ్బీ రోడ్డు నుంచి తునికిబండల మీదుగా తీగలంచ, ఇప్పనపల్లి వరకు నిర్మించిన ఈ వంతెనకు రూ.4.84 కోట్లను వెచ్చించారు. పాతూరు ఆర్అండ్బీ రోడ్డు నుంచి రాయిలంక మీదుగా రామాంజిగూడెం వరకు రూ.4.43 కోట్లతో రోడ్డు, హైలెవల్ వంతెన నిర్మించారు.
మర్కోడు ఆర్అండ్బీ రోడ్డు నుంచి పెద్దురు, సందింబంధం, మీదుగా చీమలగుంపు వరకు రూ.3.81 కోట్లతో రోడ్డు, హైలెవల్ వంతెన నిర్మించారు. సుద్దరేవు ఆర్అండ్బీ రోడ్డు నుంచి నడిమిగూడెం, లోద్దిగూడెం మీదుగా జాకారం వరకు రూ.8.10 కోట్లతో రోడ్డు, హైలెవల్ వంతెన నిర్మించారు. నిరుడు జూలై 10న ప్రజాప్రతినిధులు వీటిని ప్రారంభించారు. ఈ రోడ్లు, వంతెనలు అందబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు.
మా కష్టాలు తీరినయ్..
జల్లేరు వాగుపై వంతెనల నిర్మాణం పూర్తయింది. దీంతో ఏళ్లుగా మేం పడ్డ కష్టాలు తీరిపోయాయి. ఇప్పుడు రాత్రి, పగలు తేడా లేకుండా ఎప్పుడైనా దూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాము. బ్రిడ్జిలు లేనప్పుడు వర్షాకాలంలో మేం పడిన కష్టాలు వర్ణించలేనివి. మా బాధలు తెలంగాణ వచ్చాక తీరాయి. కొత్త జిల్లాలు, మండలాలు విభజించడంతో మా గ్రామాల్లోని సమస్యలను గుర్తించారు. వాగులపై బ్రిడ్జిలు నిర్మించారు. మా కష్టాలను తొలగించారు. తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. -కొమరం శ్రీను, లొద్దిగూడెం గ్రామం
చాలా ఇబ్బంది పడేవాళ్లం..
వాగుపై వంతెన లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. వాగులు పొంగుతున్న సమయంలో అత్యవసరమై గర్భిణులు, బాలింతలు ఆసుపత్రికి వెళ్లాలంటే నరకం చూసేవాళ్లు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా కష్టాలన్నీ తీరాయి. రోడ్లు, వంతెనలు రావడంతో రాకపోకలు మాకు చాలా సులభమయ్యాయి. ఇప్పుడు మాకు వర్షాకాలంలో ఏ ఇబ్బందీ లేదు.
-పాయం సరోజన, నడిమిగూడెం గ్రామం