కూసుమంచి, జూలై 23 : పాలేరు జలాశయం పొంగి పొర్లుతున్నది. 33 సంవత్సరాల తర్వాత భారీ స్థాయిలో వరద పోటెత్తింది. 31వేల క్యూసెక్కుల పైన నీరు రావడంతో పాలేరు నిండుకుండలా తయారైంది. వచ్చిన నీటిని వచ్చినట్లు అలుగుల ద్వారా కిందకు వదులుతున్నారు. సూర్యాపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం పడిన వర్షానికి భారీగా పాలేరుకు వరద వచ్చి చేరుతున్నది. 1989వ సంవత్సరంలో పాలేరుకు భారీస్థాయిలో 90వేల క్యూసెక్కుల వరద వచ్చింది. మళ్లీ ఈసారి 33వేల క్యూసెక్కులపైన నీరు వచ్చి చేరుతున్నది. ఇప్పటివరకు వరదలు వచ్చినా 10 నుంచి 15వేల క్యూసెక్కులు మాత్రమే నీరు వచ్చింది. గురువారం ఎడతెరిపిలేని వర్షం కారణంగా అర్ధరాత్రి నుంచి భారీగా పాలేరుకు వరద వచ్చి చేరుతున్నది. దీంతో అప్రమత్తమైన అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
పాలేరును చూసేందుకు వందలాది మంది వస్తుండడంతో పోలీస్, రెవెన్యూ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దిగువన గ్రామాల్లోని ప్రజలు వాగు వైపు వెళ్లవద్దని సూచించారు. నాయకన్‌గూడెం, పాలేరు వడ్డెర కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. పాలేరు వాగు, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చే వాగులు రోడ్డుపైన ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నాయకన్‌గూడెం గుడి వద్ద రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో రహదారిని ఒకవైపు మూసివేశారు. ఎస్ఈ నర్సింహారావు, ఈఈ సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో డీఈ రమేశ్‌రెడ్డి పాలేరు వద్దనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. తహసీల్దార్ మీనన్, సీఐ సతీశ్, ఎస్ఐ నందీప్ పాలేరు వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు. పాలేరు అలుగుల వద్దకు ఎవ్వరినీ వెళ్లకుండా గేట్లకు తాళాలు వేశారు.