ఖమ్మం, జులై 21 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర జల సంఘం వెంటనే స్పందించి శాస్త్రీయ అధ్యాయనం చేయాలని కోరారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్‌లతో ఖమ్మంలోని తెలంగాణ భవన్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1986లో భద్రాచలంలో 75.9 అడుగుల వరద వచ్చినా ఇంత ముంపు లేదని, కానీ ప్రస్తుతం 71.4 అడుగుల వరద వస్తేనే ముంపు అధికంగా ఉందని అన్నారు.
ఇక భవిష్యత్తు పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం పూర్తయితే భద్రాచలం మొత్తం మునగడం ఖాయమని అన్నారు. ఈ విషయంలో సీడబ్ల్యూసీ జోక్యం చేసుకోవాలని కోరారు. భద్రాచలం క్షేత్రాన్ని వరద ముప్పు నుంచి శాశ్వతంగా తప్పించడానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టడం కోసం పట్టణం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించిన చట్టాన్ని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని, ఆయా గ్రామాల ప్రజలు కూడా తెలంగాణలో ఉండేందుకే సముఖంగా ఉన్నారని అన్నారు. వరదల సమయంలో దాదాపు 400 కిలోమీటర్లు దూరం రోడ్డు మార్గంలో పయనించి ప్రజలకు, ఉద్యోగులకు ధైర్యం చెప్పిన ఏకైక సీఎం.. కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. వర్షంలో వచ్చి ముంపు ప్రాంతాల్లో పర్యటించారని, వరదల శాశ్వత పరిష్కారానికి రూ.వెయ్యి కోట్లు ప్రకటించారని అన్నారు.
ముంపు ప్రాంతాల్లో ఇప్పటికీ సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయన్నారు. వరద అంచనాకు కేంద్ర బృందం భద్రాచలం వస్తున్నందున తాను కూడా శుక్రవారం అక్కడికి వెళ్తున్నట్లు చెప్పారు. జడ్పీ, డీసీసీబీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కురాకుల నాగభూషణం, నాయకులు బాణోత్ చంద్రావతి, పునుకొల్లు నీరజ, బచ్చు విజయ్‌కుమార్, నల్లమల వెంకటేశ్వరరావు, గుండాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేసిందేమీలేదు: ఎమ్మెల్యే సండ్ర
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేతల్లో చేసిందేమీ లేదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. మాటల్లో మాత్రం ఆ పార్టీ నాయకులు ‘జై శ్రీరామ్’ అంటారని, అదే భద్రాచలం రాముణ్ని కాపాడుకోవడానికి మాత్రం ఏమీ చేయలేదని విమర్శించారు. వరదలు వచ్చి అనేక గ్రామాలు మంపునకు గురైనా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు.
కేసీఆర్ తక్షణమే స్పందించారు: తాతా మధు
గోదావరి వరదలు వచ్చి అనేక గ్రామాల ప్రజలు ముంపులో ఉంటే వారికి ధైర్యం చెప్పడంతోపాటు అన్ని రకాల అండదండలు అందించడంలో సీఎం కేసీఆర్ ఎంతో చొరవ చూపారని, తక్షణమే స్పందించారని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు గుర్తుచేశారు. అందుకోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు టీఆర్ఎస్ శ్రేణులన్నీ వరద సహాయక చర్యల్లో పాల్పంచుకున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో కూర్చొని నిందలు వేయడం సిగ్గుచేటన్నారు.