ఖమ్మం, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భద్రాచలం వద్ద గోదావరి మంగళవారం మరితం తగ్గుముఖం పట్టింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు 55.8 అడుగులుగా ఉన్న నీటిమట్టం రాత్రి 7 గంటలకు 3వ ప్రమాద హెచ్చరికకు దిగువన 49 అడుగులకు చేరుకుంది. అయితే భద్రాచలం ఎగువ ప్రాంతాల్లో గల ప్రాజెక్టులకు వరద నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో ఏ క్షణమైనా భద్రాచలం వద్ద కూడా గోదావరి వరద నీటిమట్టం మరికొంత పెరిగే ప్రమాదం ఏర్పడింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ ఒక ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు వరద ప్రవాహం క్రమేణా తగ్గుతుండడంతో జలదిగ్భంధంలోంచి లోతట్టు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. మరోవైపు భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, పర్ణశాల, బూర్గంపహాడ్, సారపాక, అశ్వాపురం, పినపాక, మణుగూరు తదితర ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి.. చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులకు ధైర్యం చెప్పారు.
వరద సహాయక చర్యల కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు.. సీసీఎల్ఏ కమిషనర్ రజిత్‌కుమార్ శైనీ, పీఆర్ కమిషనర్ హనుమంతరావు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్‌లు వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ముంపునకు గురైన కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు వెళ్లే ప్రధాన రహదారులపై వరదనీరు ప్రవహిస్తుండడంతో రాకపోకల పునరుద్ధరణ కాలేదు. అలాగే భద్రాచలం – వెంకటాపురం ప్రధాన రహదారిపై వరద ప్రవాహం పూర్తిగా తగ్గకపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
వరదల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన గ్రామాల్లో మంగళవారు విద్యుత్ అధికారులు పునరుద్ధరించారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరాను పునరుద్ధరించారు. సాధారణ పరిస్థితితులు నెలకొనే వరకు పునరావాస కేంద్రాలు కొనసాగించాలని ప్రభుత్వం అదేశించంతో అధికారులు కొనసాగిస్తున్నారు. భద్రాచలం రామాలయం ప్రాంతాల్లో నిలిచిన వరద నీటిని తొలగించేందుకు ఇంజినీరింగ్ సంస్థ కొనుగోలు చేసిన శక్తివంతమైన మోటార్లతో గోదారిలోకి పంపింగ్ చేశారు. మరోవైపు వరద బాధిత గ్రామాల్లో వైద్య సేవలను ముమ్మరం చేశారు. భద్రాచలం పరిసర గ్రామాల్లో వరద నీటితో అపరిశుభ్రంగా తయారైన ప్రాంతాల్లో సిబ్బంది పారిశుధ్య నివారణ పనులు చేపట్టారు. బ్లీచింగ్ చల్లడంతోపాటు దోమల నివారణకు మందు స్ప్రే చేశారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల సహాయానికి సంబంధించి అధికారులు అర్హుల జాబితాను రూపొందించే పనుల్లో నిమ్నమయ్యారు. బుధవారం నుంచి కుటుంబానికి రూ.10 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. మరోవైపు దిగువన ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్లనే భద్రాచలంలో వరద నీటిమట్టం వేగంగా తగ్గడం లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వివరించారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన 7 మండలాలను, భద్రాచలంలోని 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఆంధ్రాలో కలిసిన పూర్వపు తెలంగాణ ప్రజలు.. తమను తెలంగాణలోనే కలపాలని, సీఎం కేసీఆర్ అందిస్తున్న సహాయం తమకు వర్తింపజేయాలని మంగళవారం ఏటపాక ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. భద్రాచలంతో అనుసంధానంగా ఉన్న ఎటపాక కరకట్ట మరమ్మతుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. అలాగే చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపహాడ్ మండలాలకు నిత్యావసర వస్తువులను ఆర్మీ హెలీకాఫ్టర్ ద్వారా పంపిణీ చేశారు. నిత్యావసర వస్తువుల పంపిణీకి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పువ్వాడ ఆదేశించారు.