వారం రోజులు ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి.. వరద పోటుతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతవాసులు చిగురుటాకులా వణికిపోయారు. ఊరూవాడా గోదారైన వేళ బాధితులంతా ఆపన్నహస్తం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూశారు. గూడు చెదిరిన పక్షుల్లా కకావికలమయ్యారు. వరదలు చుట్టిముట్టడంతో వేళ తెలంగాణ ప్రభుత్వం మెరుపు వేగంగా సహాయక చర్యలు చేపట్టింది. అనూహ్యంగా పెరిగిన గోదావరి వరదతో ప్రజలంతా ఆందోళన చెందుతున్న సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందాన్ని రంగంలోకి దింపి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు, పకడ్బందీ వ్యూహంతో రక్షణ చర్యలు చేపట్టింది. ముంపు వాసులను పునరావాస కేంద్రాలకు తరలించి సకల సౌకర్యాలు కల్పించింది. కొన్నిచోట్ల ప్రజలు వరదలోని తమ ఇండ్లలో ఉండడంతో అధికారులు అక్కడికెళ్లి వారిని ఒప్పించి పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టారు. ఈ సారి ఉవ్వెత్తున వరద ముంచెత్తినా ప్రభుత్వం వేగంగా స్పందించడంతో ప్రాణనష్టం జరగలేదు.
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 19 (నమస్తే తెలంగాణ) : ఆపత్కాలంలో ఆదుకోవడమంటే ఏమిటో టీఆర్ఎస్ సర్కారు చేసి చూపించింది. ఒక్కసారిగా వరదలు చుట్టిముట్టి ఆపన్నహస్తం కోసం చేయి చాచిన బాధితుల చేయందుకొని చేయూతనందించింది. సాయమందించడమంటే ఏమిటో సాక్షత్కరింపజేసింది. అనూహ్యంగా గోదావరి వరదలు పెరిగి పరీవాహకంలోని ప్రజలంతా ఆర్తనాదాలు చేస్తున్న వేళ సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందాన్ని రంగంలోకి దింపి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆ అధికారులంతా పక్కా వ్యూహంతో పకడ్బందీ చర్యలు చేపట్టి ప్రభావిత ప్రాంతాల ప్రజలందరినీ రక్షించారు. ఒక్కోచోట కొందరు ప్రజలు వదరలోని తమ ఇళ్లలోనే ఉండడంతో సీనియర్ ఐఏఎస్ అధికారులు అక్కడికి వెళ్లి వారిని ఒప్పించి పునరావాస కేంద్రాలకు తరలించారు. దీంతో ఎక్కడా ప్రాణనష్టం వాటిల్లలేదు.
1986 గోదావరి వరదలు భద్రాచలం ఏజెన్సీని అతలాకుతలం చేశాయి. జీవాలు, చివరికి మానవ ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. పటిష్ట సహాయక చర్యలు అందించి ప్రజల ప్రాణాలను కాపాడడంలో అప్పటి ప్రభుత్వం విఫలం కావడమే ఇందుకు ఉదాహరణగా చెబుతుంటారు. కానీ ఈ ఏడాది సరిగ్గా వారం రోజుల క్రితం గోదావరి ప్రవాహం ఉగ్రరూపం దాల్చడంతో యుద్ధ ప్రాతిపదికన యంత్రాంగాన్ని రంగంలోకి దింపిన టీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి వరదల సమర్థవంతంగా ఎదుర్కొన్నది. వరద ప్రవాహం రెండు రోజుల్లోనే ప్రమాదకరస్థాయికి పెరిగినా.. టీఆర్ఎస్ ప్రభుత్వ సూచనల మేరకు పటిష్ట చర్యలు చేపట్టిన అధికారులు ప్రజలందరినీ రక్షించారు. భద్రాచలం పట్టణంలోకి వరద నీరు రాకుండా సింగరేణి సహకారంతో 1800 హెచ్‌పీ మోటార్లను తీసుకొచ్చి ఆలయ పరిసరాల్లో నీరు లేకుండా చేయగలిగారు. ముంపు ప్రాంతాలైన మరో 240 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెనువెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఇప్పటికే 230 గ్రామాల్లో విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించారు.
ముమ్మరంగా పారిశుధ్య పనులు..
వరదలు వచ్చి తగ్గాక వ్యాధులు విజృంభించడం పరిపాటి. కానీ అలాంటి వ్యాధులకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పకడ్బందీ చర్యలు చేపట్టింది. ముంపు ప్రాంతాల్లో పారిశుధ్యంపై కలెక్టర్ అనుదీప్ ప్రత్యేక దృష్టి సారించారు. రెండు జిల్లాల నుంచి 4,100 మంది పారిశుధ్య కార్మికులను ముంపు మండలాలకు తరలించి గోదావరిలో కొట్టుకొచ్చిన చెత్తను తొలగించి రహదారులను శుభ్రం చేయించారు. ఇందుకోసం నలుగురు ఆర్డీవోలను 4 ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఐదుగురు డీపీవోలు, 10 మంది డీఎల్పీవోలను పారిశుధ్య పనుల పర్యవేక్షణకు చేయించారు. ఫాగింగ్ చేసి దోమల వ్యాప్తిని అరికట్టగలిగారు. హైదరాబాద్ నుంచి 9 ఫాగింగ్ యంత్రాలను తెప్పించారు. మొత్తం 30 యంత్రాల ద్వారా దోమల జాడ లేకుండా చేశారు. చెత్తను తొలగించడానికి 127 ట్రాక్టర్లను వినియోగించారు.
తాగు నీటి సమస్యకు చెక్..
ముంపు ప్రాంతాల్లో ముందుగానే విద్యుత్ సరఫరా నిలిపి వేస్తారు. దీంతో మిషన్ భగీరథ, జీపీల్లో ఉన్న ట్యాంకులకు నీటి సరఫరా నిలిచిపోయింది. అందుకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి ముంపు ప్రభావిత ప్రాంతాల వాసులకు సరఫరా చేశారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఉన్న 200 ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లయి చేశారు. వరదలో ఉండగానే మినరల్ వాటర్ బాటిళ్లను కూడా పునరావాస కేంద్రాల్లో పంపిణీ చేశారు.
అడుగడుగునా వైద్య సేవలు..
అసలే ఇది వ్యాధులు ప్రబలే సీజన్. అదే సమయంలో వరదలు. కానీ ఎవరికీ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా వైద్య సేవలను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కేసీఆర్ సూచనల మేరకు వైద్యారోగ్యశాఖ రాష్ట్ర డైరెక్టర్ గడల శ్రీనివాస్‌రావును ప్రత్యేక అధికారిగా నియంమించడంతో ఆయన అన్ని గ్రామాల్లోనూ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయించార. 10,276 మందికి వైద్య సేవలందించారు. గర్భిణులకు ప్రసవాల సమస్య లేకుండా వరదలను దాటుకుంటూ అంబులెన్సుల ద్వారా ఆసుపత్రికి తరలించారు. 106 మందికి ప్రసవాలు జరిగాయి. ఇందుకోసం 22 మంది వైద్యులు, 670 మంది వైద్యసిబ్బందిని నియమించారు. 297 హైరిస్క్ గ్రామాలకు మెడికల్ బృందాలను పంపి వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు.
భద్రాద్రిలో మోహరించిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు..
వరదల సమయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ భద్రాద్రి జిల్లాకు రాష్ట్ర యంత్రాంగాన్ని పంపారు. జిల్లాలో ఇప్పటికే ఉన్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అనుదీప్, గౌతమ్ పోట్రు, వినీత్, రోహిత్రాజ్లకు తోడుగా రాజధాని నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారులు రజత్‌కుమార్ షైనీ, శ్రీధర్, హన్మంతరావు, హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావులను భద్రాద్రి జిల్లాకు డిప్యూట్ చేశారు. ఇప్పటికీ వారు ఇక్కడే ఉండి వరద నివారణ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
భద్రాచలంలోనే మకాం వేసిన మంత్రి..
సీఎం ఆదేశాల మేరకు వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భద్రాచలంలోనే మకాం వేశారు. అధికారులను సమన్వయం చేస్తూ వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు. మరోవైపు పునరావాస కేంద్రాల్లోని బాధితులను పరామర్శిస్తూ వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకటరావు సైతం భద్రాచలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం హెలీకాప్టర్‌ను కూడా అందుబాటులో అందుబాటులో ఉంచింది.