ఖమ్మం వ్యవసాయం, జూలై 19 : సన్న రకానికి చెందిన ఎండు మిర్చి పంటకు గతంలో ఎన్నడూ లేనివిధంగా లావురకం ధర పలుకుతున్నది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం ఖమ్మం మార్కెట్లో తేజా, ఇతర సన్నరకం ఏసీ పంట ఉత్పత్తులకు ఊహించని ధరలొస్తున్నాయి. రెండేండ్ల క్రితం ఖమ్మం మార్కెట్లో ఒకే ఒక రోజు తేజా రకం మిర్చి పంటకు క్వింటాల్‌కు రూ.22 వేలు పలికింది. దీంతో జాతీయస్థాయిలోనే అత్యధిక ధర నమోదైంది. మూడేళ్ల తర్వాత ఈ సీజన్లో పక్షం రోజుల క్రితం మరోసారి క్వింటాల్‌కు రూ.22 వేలు పలికింది.
మంగళవారం ఉదయం జరిగిన జెండా పాటలో గరిష్ఠ ధర క్వింటాల్‌కు రూ.24,000 పలికి సరికొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు 33 ఏళ్ల క్రితం మహికో కంపెనీ తేజారకం (సన్న రకం) మిరప విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నాటి నుంచి నేటి వరకు కేవలం 30-40 శాతం స్థానికులకు అహార పదార్థాలకు వినియోగం జరుగుతున్నది. మిగిలిన 60-70 శాతం పంట ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నది. ఖమ్మం జిల్లాలో ఏటా దాదాపు 50-60 వేల ఎకరాల్లో రైతులు తేజా రకం పంట సాగు చేస్తున్నారు. గతేడాది రికార్డుస్థాయిలో లక్ష ఎకరాల్లో సాగు కావడం, వైరస్ సోకడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో వ్యాపారులు పోటీపడి పంటను కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రేటు గణనీయంగా పెరుగుతున్నది.
పెరుగుదలకు ప్రధాన అంశాలివే..
జిల్లా మార్కెటింగ్‌శాఖకు సంబంధించి ఆయా మార్కెట్ల ప రిధిలో 42 కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏ డాది రైతులు సుమారు 27లక్షల బస్తాలను రైతులు, వ్యాపారులు నిల్వ చేసుకున్నారు. వాటిలో ఇప్పటికే 10 లక్షల బస్తాల వరకు క్రయవిక్రయాలు జరిగాయి. ఎక్కువ మొత్తంలోనే సరుకు ఉన్నా.. ధరల పెరుగుదల ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తున్నది. ఇందుకు అనేక కారణాలున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో సన్నరకం మిర్చి అంటే కేవలం తేజా రకం ఉండేది. ఈ రకం పంట ఉత్పత్తులు ఎక్కువ మొత్తంలో చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌కు ఎగుమతయ్యేవి. గడిచిన రెండేళ్లు సన్న రకాలకు సంబంధించిన మిర్చి విత్తన కంపెనీలు అనేకం అందుబాటులోకి వచ్చా యి. ఘాటు, ధర తక్కువ ఉండడంతో దేశీయ మార్కెట్లో వినియోగం పెరిగింది.
దీంతో లోకల్ ఖరీదుదారులే పోటీపడి పంటను కొంటున్నారు. గతేడాది అధికంగా సాగు జరగడం, వైరస్ కారణంగా పంట దెబ్బతినడంతో ఈ సారి మిర్చి సాగు గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తున్నది. ప్రముఖ మిర్చి ఖరీదుదారులు వానకాలం మిర్చి విత్తనాల కొనుగోళ్లు అం చనా వేస్తూ పంటను కొంటున్నారు. ఇప్పటికే స్థానికంగా కొం దరు ఖరీదుదారులు సుమారు 4 లక్షల బస్తాలను కొని నిల్వ చేసినట్లు సమాచారం. వచ్చే నెలలో మిర్చి సాగు అంచనాను బట్టి ఏసీ మిర్చి ధరలో మరింత వ్యత్యాసం ఉండొచ్చు.
అన్నదాతల్లో ఆనందం
ఈ ఏడాది అన్ని రకాల పంటల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. మార్కెట్‌కు పంటను తీసుకొచ్చిన రైతుల్లో మోముల్లో ఆనందం కనిపిస్తున్నది. వ్యాపారులు, అధికారులు ఊహించని విధంగా మిర్చి ధరలు పెరుగుతున్నాయి. గతంలో గరిష్ఠ ధర క్వింటాల్‌కు రూ.22వేలు ఉంది. అది చరిత్రలో ఒకేసారి పలికింది. వారం రోజుల నుంచి ఏసీ రకం మిర్చి పంటల ధరలు చరిత్ర తిరగరాస్తున్నాయి. దేశంలో ఎక్కడలేని విధంగా ఖమ్మం మార్కెట్లో మంచి ధరలు రావడం సంతోషంగా ఉంది.
– డౌలే లక్ష్మీప్రసన్న, ఖమ్మం ఏఎంసీ చైర్పర్సన్
ఆంధ్రా కంటే అధిక ధర
మిర్చిపంటకు ఆంధ్రా కంటే తెలంగాణలోనే ఎక్కువ ధరలు పలుకుతున్నాయి. రెండు ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశాను. సీజన్లో ఆరంభంలోనే ఏసీలో నిల్వ చేశాం. కొద్ది రోజుల నుంచి ఖమ్మం మార్కెట్లో పెరుగుతున్న ధరల గురించి వ్యాపారి ద్వారా తెలుసుకున్నా. గుం టూరు మార్కెట్ కంటే ఖమ్మం మార్కెట్లోనే మం చి ధర పలుకుతున్నాయి. ఈ రోజు గరిష్ఠ ధర రూ.24 వేలు పలికింది. చాలా సంతోషంగా ఉంది.
– తళ్ళూరి జైపాల్‌రెడ్డి,మిర్చి రైతు, కృష్ణా జిల్లా