పాల్వంచ, జూలై 19: తన కూతురితో తరచూ గొడవ పడుతున్న అల్లుడిని ఆ అత్త మందలించింది. దీనిని అతడు సహించలేకపోయాడు. ఆమెపై పగ పెంచుకున్నాడు. అర్ధరాత్రి వేళ ఆమెను గొంతు నులిమి చంపాడు. ఈ దారుణాన్ని చూసిన పాపానికి ఆమె ఏడేళ్ల మనుమడిని కూడా చంపేశాడు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. పాల్వంచలోని ఏఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రోహిత్ రాజు వెల్లడించిన వివరాలు.. ఈ నెల 8వ తేదీన దమ్మపేట మండలం మల్కారం గ్రామంలో గుడిమెట్ల సుబ్బలక్ష్మి(50), ఆమె మనుమడు ఆకాష్ (7) మంచం పైనే మృతిచెందారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ రెండు హత్యల ప్రధాన నిందితుడు ఆ వృద్ధురాలి అల్లుడు శ్రీనివాసరావుగా తేల్చారు.
ఎలా చంపాడంటే..
తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాతివనం మండలం వెలివెల్లు గ్రామానికి చెందిన వల్లవరపు శ్రీనివాసరావుకు, 2006లో సుబ్బలక్ష్మి తన కూతురు శ్రీదుర్గను ఇచ్చి వివాహం జరిపించింది. ఆ దంపతులు నాలుగేళ్లపాటు బాగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి శ్రీనివాసరావు తన భార్యతో తరచూ గొడవ పడుతున్నాడు. దీంతో అతడిని అత్త సుబ్బలక్ష్మి అనేకమార్లు మందలించింది. దీంతో ఆమెపై అల్లుడు శ్రీనివాసరావు పగ పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా చంపాలనుకున్నాడు. ఇందుకోసం పథకం వేశాడు. దమ్మపేట మండలంలో తాపీ పని చేసేందుకు రెండు నెలల క్రితం ఒక్కడే వచ్చాడు. అప్పటి నుంచి అత్త ఇంట్లోనే ఉంటున్నాడు.
ఆ ఇంట్లో సుబ్బలక్ష్మితోపాటు ఆమె కుమారుడు కొర్రాజులు-కోడలు, వారి కుమారుడు ఉంటున్నారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం కొర్రాజులు దంపతులు అన్నపురెడ్డిపల్లి గ్రామానికి వెళ్లారు. ఆ రాత్రి ఇంట్లో సుబ్బలక్ష్మి, మనుమడు (కొర్రాజులు కుమారుడు) ఆకాష్ పడుకున్నారు. ఇదే అవకాశంగా భావించిన శ్రీనివాసరావు, గాఢ నిద్రలో ఉన్న సుబ్బలక్ష్మిని గొంతు నులిమి చంపాడు. పక్కనే పడుకున్న బాలుడు ఆకాష్ దిగ్గున మేల్కొన్నాడు. చూసింది చెబుతాడేమోనన్న భయంతో.. ఆ చిన్నారిని కూడా చంపేసి పారిపోయాడు. పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు నిందితుడు అల్లుడేనని నిర్ధారించారు. పరారీలో ఉన్న అతడిని మంగళవారం అరెస్ట్ చేశారు. సమావేశంలో అశ్వారావుపేట సీఐ బాలకృష్ణ, దమ్మపేట ఎస్సై శ్రావణ్ పాల్గొన్నారు.