ఖమ్మం, జూలై 17 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది. ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నది. శనివారం 8 రాత్రి 68 అడుగుల మేర ఉన్న నీటిమట్టం ఆదివారం సాయంత్రం 5 గంటలకు 60.60 అడుగులకు చేరుకున్నది. ఎగువ ప్రాంతాల నుంచి 18,020,392 క్యూసెక్కుల నీరు నదిలో కలుస్తున్నది. ఉదయం గంటకు 30 ఇంచుల చొప్పున తగ్గిన నీటిమట్టం మధ్యాహ్నం నుంచి గంటకు 40 ఇంచుల చొప్పున తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. నీటిమట్టం 53 అడుగులకు తగ్గితే కలెక్టర్ అనుదీప్ హెచ్చరికను ఉపసంహరించనున్నారు.
జల దిగ్బంధంలోనే ఏజెన్సీ
వరుసగా కురుస్తున్న వర్షాలకు చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, సారపాక, మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లోని ముంపు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మంత్రి పువ్వాడ అజయ్మకుమార్ నేతృత్వంలో కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, మిలటరీ బలగాలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి నిత్యావసర సరుకులు, ఆహారం అందిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించడంపై దృష్టి సారించారు.
భద్రాచలం బ్రిడ్జిపై రాకపోకల పునరుద్ధరణ
గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం కలెక్టర్ అనుదీప్ భద్రాద్రి బ్రిడ్జిపై 48 గంటల పాటు రాకపోకలు నిలిపివేశారు. దీంతో రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాకు, అటు నుంచి రాష్ర్టానికి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భద్రాచలం- వెంకటాపురం ప్రధాన రహదారిపై ఇప్పటికీ వరద నిలిచే ఉన్నది. శనివారం సాయంత్రానికి నిషేధాన్ని ఎత్తివేయాల్సి ఉండగా ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది. వరద క్రమేపి తగ్గుతుండడంతో రాత్రి 7 గంటల నుంచి తిరిగి రాకపోకలను అనుమతిస్తూ కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ను ఎత్తివేశారు.