కూసుమంచి, జూలై 17: పాలేరు రిజర్వాయర్‌కు వరద తగ్గింది. అలుగుల నుంచి ఆటోమేటిక్ గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. పాలేరుకు ఎగువన పడుతున్న వర్షాలతో వరద నీరు పోటెత్తడంతో రిజర్వాయర్ నుంచి నీటిని కిందకు వదిలారు. ఆదివారం సాయంత్రానికి సుమారు 150 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. దీంతో రిజర్వాయర్ నీటి మట్టం 22.5 అడుగు వద్ద బ్యాలెన్సింగ్‌గా ఉంచారు. ఇంతకు మించి వచ్చిన నీటిని వెంటనే ఫాలింగ్ గేట్ల ద్వారా వదులుతారు. మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వర్షం పడితే పాలేరుకు వరద నీరు వస్తుంది.
తిరుమలాయపాలెం, జూలై 17: మండలంలో రెండు రోజులపాటు తెరిపిచ్చిన వర్షం ఆదివారం మళ్లీ మొదలైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా వర్షం కురిసింది. పత్తి చేలల్లో వర్షపు నీరు నిలవడంతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. ఎడతెరిపి లేని వర్షాలతో ఖరీఫ్ పంటలు దెబ్బతింటాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.