ఖమ్మం, జూలై 17 (నమస్తేతెలంగాణ, ప్రతినిధి): గోదావరి వరదల నేపథ్యంలో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల వ్యాప్తంగా 7,274 కుటుంబాలు ప్రభావితమయ్యాయని, ప్రతి కుటుంబానికి రూ.10 వేల చొప్పున నగదు, 20 కిలోల చొప్పున బియ్యాన్ని ప్రభుత్వం తక్షణ సాయంగా అందిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
ఆదివారం ఆయన గోదావరి పరిస్థితులను పరిశీలించేందుకు తొలుత హెలికాఫ్టర్ మార్గం ద్వారా ఏరియల్ సర్వే, పర్యటన ఖరారైనప్పటికీ వర్షం వచ్చి వాతావరణం అనుకూలించకపోవడంతో ముఖ్యమంత్రి రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకున్నారు. తొలుత గోదావరి కరకట్ట వద్ద నది శాంతించాలని పూజలు నిర్వహించారు. నన్నపనేని మోహన్ ప్రభుత్వ పాఠశాల పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న ప్రజలతో స్వయంగా మాట్లాడారు.
పట్టణంలోని సుభాశ్‌నగర్, కొత్తకాలనీ తదితర ప్రాంతాలు చిన్నపాటి వరద వచ్చినా ముంపునకు గురవుతున్నాయని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సమస్యపై సీఎం సానుకూలంగా స్పందించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వరదలు పూర్తిగా తగ్గే వరకు కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. అనంతరం పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ఏటా వరద ముప్పు ఉండే ప్రమాదం ఉన్నందున, ఎత్తైన ప్రదేశాల్లో వారి కోసం రూ.వెయ్యి కోట్లతో కాలనీలు కట్టిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ఎత్తైన ప్రాంతాల్లో స్థలాల కోసం అన్వేషించాలని కలెక్టర్ అనుదీప్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను ఆదేశించారు. రూ.వెయ్యి కోట్లతో నిర్మించే ఇళ్లకు తానే శంకుస్థాపన చేస్తానన్నారు.
ఈనెల 29 వరకు వానలు కురిసే అవకాశం ఉందని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సింగరేణి సాయంతో ప్రభుత్వం ముంపు వాసుల కోసం శాశ్వత ప్రాతిపదికన ఇండ్లు నిర్మిస్తుందన్నారు. 80-90 అడుగుల మేర వరద వచ్చినా తట్టుకునే విధంగా ఇండ్లు నిర్మిస్తామన్నారు. భద్రాచలం పట్టణంలోని అనేక కాలనీలు 50 అడుగుల వరద వచ్చినా ముంపునకు గురైయ్యే పరిస్థితి ఉందన్నారు. బూర్గంపాడు వైపు కరకట్ట నిర్మిస్తామని, భద్రాచలంలోని కరకట్టను పటిష్టపరుస్తామన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వారం రోజులుగా వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రాణనష్టం లేకుండా చూసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అభినందనీయుడన్నారు. 70 అడుగులకు పైగా వరదలు వచ్చినా ప్రజలను కాపాడుకున్న భద్రాద్రి జిల్లా యంత్రాంగం సేవలు ప్రశంసనీయమన్నారు. వానకాలం ముగిసే వరకు అధికారులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు.
విదేశాల కుట్రలో భాగంగా క్లౌడ్ బరస్ట్..?
ఎడతెరపిలేకుండా వర్షాలు కురవడంలో విదేశీ కుట్ర ఉందనే అనుమానం వ్యక్తమవుతుందని, క్లౌడ్ బరస్ట్ ద్వారా వర్షాలు కురిపించి ఉండవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అనుమానం వ్యక్తం చేశారు. ఇ దే రీతిలో గతంలో కాశ్మీర్‌లోని లద్ధాఖ్, ఉత్తరాఖండ్‌లో ఉత్పాతాలు సంభవించాయని గుర్తు చేశారు. కడెం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులు మాత్రమేనని, ఈసారి వానలకు 5 లక్షల క్యూసెక్కుల నీరు చేరినా ప్రాజెక్టు చెక్కు చెదరలేదన్నారు. కేవలం భగవంతుడి దయతోనే కడెం ప్రాజెక్టు సురక్షితంగా ఉందన్నారు. భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, దీనిపై మరోసారి పట్టణంలో పర్యటిస్తానని వివరించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు..
వరద నీరు తగ్గుముఖం పట్టాక ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డెరెక్టర్ గడల శ్రీనివాసరావును ఆదేశించారు. ముంపు బాధితులకు వరంగల్ ఎంజీఎం వైద్యుల ద్వారా వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్య సేవల విషయంలో ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామన్నారు. మరో మూడు నెలల పాటు వానలు కురిసే అవకాశం ఉన్నందున యత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రాచలం కరకట్ట మరమ్మతులపై ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. వరదల నివారణకు నిపుణులు, ఇంజినీర్లు, ఐఐటీ ప్రొఫెసర్ల సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.
అధికారులపై ప్రశ్నల వర్షం..
భద్రాచలంలోని రామాలయం ప్రాంతంలో వరద నిలిచి ఉండడంపై సీఎం కేసీఆర్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. వరద నీటిని తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నీటిని మళ్లించడానికి ఎన్ని మోటార్లు వినియోగిస్తున్నారు? ఎంత సామర్థ్యం ఉన్న మోటార్లు వాడుతున్నారని అడిగారు. స్పందించిన అధికారులు ఇప్పుడు వినియోగిస్తున్న రెండు మోటర్లు సరిపోవడం లేదని, ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటర్ల అవసరం ఉందన్నారు.
సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారు. జిల్లాలోని పగిడిపల్లి ఎత్తిపోతల పథకం, మోడికుంట, పాలెం వాగు ప్రాజెక్టుల పరిధిలో మిగిలిన ఉన్న పనుల ఆవశ్యకత గురించి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారని, పనులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 1986లో ముంచెత్తిన విధంగా వరద పరిస్థితులు గుర్తుకుతెస్తున్నాయన్నారు. విపత్కర పరిస్థితుల్లో అనుభవజ్ఞులైన అధికారుల సేవలను వినియోగించుకోవాలని, అవసరమైతే ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్‌ను సహాయక చర్యల్లో భాగస్వామిని చేయాలన్నారు.
సీనియర్ ఐఏఎస్ అధికారులు హనుమంతరావు, రజత్‌కుమార్ శైనీ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు. అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రజాసమస్యలపై ఇచ్చిన వినతులను స్వీకరించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వరంగల్ రేంజీ ఐజీ నాగిరెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, రాములునాయక్, బానోత్ హరిప్రియానాయక్, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, సీనియర్ ఐఏఎస్ అధికారులు శ్రీధర్, రజత్‌కుమార్ శైనీ, హనుమంతరావు, భద్రాద్రి, ఖమ్మం జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్‌రాజు, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పర్యటన సాగిందిలా…
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 17 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ముంపువాసుల్లో భరోసా నింపింది. ఉదయం 11.55 గంటలకు భద్రాచలంలోని కరకట్ట ప్రదేశానికి చేరకున్న సీఎంకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు స్వాగతం పలికారు. 12.04 నిమిషాలకు గోదావరి శాంతించాలని ప్రత్యేక పూజలు చేశారు. కరకట్ట కిందకు దిగి నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు. వరద సహాయక చర్యలపై యంత్రాంగానికి సలహాలు సూచనలిచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి, ఎస్పీ వినీత్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో సీఎం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ను సమర్థంగా నిర్వహిస్తున్న కలెక్టర్ అనుదీప్‌తో పాటు యంత్రాంగాన్ని సీఎం అభినందించారు. 12.55 నిమిషాలకు తిరిగి హెలికాప్టర్లో ఏటూరునాగారం వెళ్లారు.