భద్రాచలం, జూలై 16: భద్రాచలం ఏజెన్సీని గోదావరి వరదలు ముంచెత్తుతున్నా.. ప్రాణనష్టం జరుగకుండా కాపాడుకున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఇందుకు జిల్లా యంత్రాంగం సేవలకు సెల్యూట్ చేస్తున్నామని అన్నారు. గోదావరి వరదల సహాయక చర్యలు, పునరావాస కేంద్రాల ఏర్పాటు, వైద్య సేవలు, విద్యుత్ పునరుద్ధరణ, సురక్షిత మంచినీటి సరఫరా, గోదావరి వరదల నుంచి కరకట్ట పటిష్టత తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో ఐటీడీఏ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో ఆయన మాట్లాడారు. వరద ముంపు తగ్గిన తరువాత ప్రజలకు ఇళ్లకు చేరేలోగా యుద్ధప్రాతిపదికన పారిశుధ్య పనులు చేపట్టి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
వరదలపై సీఎం కేసీఆర్ సమీక్షించే అవకాశం ఉన్నందున వరద ముంపునకు గురయ్యే మండలాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై అన్ని శాఖల అధికారులు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. భద్రాచలం కరకట్ట పటిష్టత, మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చేపట్టాల్సిన పనులపై అంచనా తయారు చేయాలన్నారు. పోలవరం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. పర్ణశాల సబ్ స్టేషన్ ముంపునకు గురవుతున్నందున దానిని ఎత్తయిన ప్రదేశంలో నిర్మించేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. వరదలపై సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వేతోపాటు సమీక్ష సమావేశం నిర్వహిస్తారన్నారు. వరదల వల్ల కలిగిన నష్టం, పునరుద్ధరణకు అయ్యే నిధుల కోసం నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు.
72 గ్రామ పంచాయతీలు వరద ముంపునకు గురయ్యాయని, దాదాపు 10 వేల ఇళ్లు నీట మునిగాయని, 20 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని వివరించారు. వరదలు తగ్గిన తరువాత మనకు పెద్ద టాస్క్ ఉంటుందన్నారు. మైదాన ప్రాంత సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వరద సహాయక చర్యల పర్యవేక్షణకు జిల్లాకు నియమించిన సీసీఎల్ఏ డైరెక్టర్ రజత్‌కుమార్ షైనీ, సింగరేణి సీఎండీ శ్రీధర్, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావులు ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ వైద్యసేవల నిర్వహణకు ప్రతి ప్రాథమిక కేంద్రంలో ఐదుగురు వైద్యులతోపాటు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. జ్వర ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. అత్యవసర మందులను సిద్ధంగా ఉంచుకోవాలని, వరదలు తగ్గిన తరువాత వైద్య సేవలు, పారిశుధ్య కార్యక్రమాలు, విద్యుత్ పునరుద్ధరణ వంటివి అత్యంత ముఖ్యమని స్పష్టంచేశారు. జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, ఎస్పీ డాక్టర్ వినీత్, ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు, సింగరేణి డైరెక్టర్ (పా) బలరాం, డీపీవో రమాకాంత్, డీఎంహెచ్‌వో డాక్టర్ దయానంద స్వామి, ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.