భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం, జూలై 16: పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ రాకుండా సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, వరద సహాయక చర్యల ప్రత్యేక అధికారి హనుమంతరావు అన్నారు. గోదావరి వరద ముంపు గ్రామాల ప్రజలకు ఆశ్రయం కల్పించిన బీపీఎల్ స్కూల్, రైతు వేదిక, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల, గిరిజన భవన్, లక్ష్మీపురం, మోరంపల్లి బంజర ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ.. పునరావాస కేంద్రాల్లో ప్రజలు పరిశుభ్రతను పాటించే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.
ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపడుతూ అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు చింతపండు, టమాటలతో కూడిన ఆహారాన్ని, నిల్వ ఉన్న ఆహారాన్ని పెట్టవద్దని సూచించారు. వేడిగా ఉన్న ఆహార పదార్థాలను పెట్టాలని ఆదేశించారు. సురక్షిత మంచినీటి సరఫరా చేయాలని, మిషన్ భగీరథ అధికారులు మంచినీటి పరీక్షలు నిర్వహించాలని అన్నారు. వరద పూర్తిగా తగ్గిపోయి పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని ముంపు బాధితులకు సూచించారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, ప్రత్యేక వర్కర్లను నియమించుకొని పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణకు డిప్యూటేషన్ చేయాలని సూచించారు.
సురక్షితంగా ఇళ్లకు పంపాలి: ఐజీ నాగిరెడ్డి
గోదావరి వరదలు తగ్గుముఖం పట్టాక బాధితులను సురక్షితంగా వారి ఇళ్లకు పంపించాలని వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి.. అధికారులను ఆదేశించారు. భద్రాచలంలోని నన్నపనేని మోహన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని శనివారం రాత్రి ఆయన పరిశీలించారు. ఆదివారం సీఎం పర్యటన ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్‌లను ఆదేశించారు. ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజ్, తహసీల్దార్ శ్రీనివాస్‌యాదవ్, పాఠశాల హెచ్ఎం రాజ్యలక్ష్మి, ఇతర అథికారులు పాల్గొన్నారు.