భద్రాచలం, జూలై 16: ‘తల్లీ శాంతించూ..’ అంటూ గోదారమ్మకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. భద్రాచలం వద్ద వారం రోజులుగా గోదావరి ఉగ్రరూపం దాలుస్తూ ఏజెన్సీని అతలాకుతలం చేసింది. 1990 ఆగస్టు 24 నాటి వరదను మించి 71.30 అడుగులుగా వరద ప్రవాహం నమోదైంది. ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యలు, పర్యవేక్షణలో భాగంగా మూడు రోజులుగా భద్రాచలంలోనే బస చేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థాన అర్చకులు, వేద పండితులతో కలిసి గోదావరికి హారతులు సమర్పించారు. గోదావరి మాత అష్టోత్తరం పఠించారు. పసుపు, కుంకుమ, పూలు, గాజులు, చీరె, జాకెట్టు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీసీఎల్ఏ డైరెక్టర్ రజత్‌కుమార్ షైనీ, సింగరేణి సీఎండీ శ్రీధర్, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, దేవస్థానం ఈవో బానోత్ శివాజీ, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.