మధిరరూరల్, జూలై 15: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మధిర నియోజకవర్గ స్పెషలాఫీసర్, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వీ సుబ్బారావు అన్నారు. శుక్రవారం మండలంలోని నిధానపురం గ్రామంలో జరుగుతున్న ఫ్రైడే- డ్రైడే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇళ్లల్లో నీరు నిల్వ లేకుండా ప్రతిరోజు డివాటరింగ్ చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలని సర్పంచ్‌కు సూచించారు. అనంతరం బూస్టర్‌డోస్ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మాటూరుపేట పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్, ఆరోగ్య పర్యవేక్షకుడు భాస్కర్‌రావు, సుభాషిని, సెక్రటరీ శ్రీహరి, మహిళా ఆరోగ్య కార్యకర్తలు మరియమ్మ, సీహెచ్ రాజ్యలక్ష్మి, ఆశ కార్యకర్తలు వేము పద్మ, వాణి పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ బూస్టర్‌డోస్ వేయించుకోవాలి
18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ బూస్టర్‌డోస్ వేసుకోవాలని మాటూరుపేట పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని నిధానపురం గ్రామంలో బూస్టర్ డోస్‌ను ప్రారంభించి ఫ్రైడే- డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. పాతటైర్లు, డబ్బాలు, రోల్లు, టైర్లు, గాబులల్లో నీటిని డీవాటరింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ శ్రీహరి, ఆరోగ్య పర్యవేక్షకుడు భాస్కర్‌రావు, మహిళా ఆరోగ్య కార్యకర్త రాజ్యలక్ష్మి, ఆశ కార్యకర్తలు వేము, పద్మ పాల్గొన్నారు.
వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలి
చింతకాని, జూలై 15 : పల్లెల్లో అనునిత్యం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని డీఆర్డీఏ ఏపీడీ శ్రీనివాసరావు, ఎంపీడీవో తేళ్లూరి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండలంలోని నాగిలిగొండలో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాల్లో భాగంగా పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చాట్ల సురేశ్, కార్యదర్శి కొండపల్లి అనిల్‌కుమార్, వార్డుసభ్యులు, ఈజీఎస్, పంచాయతీసిబ్బంది పాల్గొన్నారు.
పరిశుభ్రతతోనే ఆరోగ్యం
కూసుమంచి, జూలై 15: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని ఐసీడీఎస్ పీడీ సంధ్యారాణి అన్నారు. శుక్రవారం కూసుమంచిలో ఫైడ్రే డ్రైడే పనులను పరిశీలించి మాట్లాడారు. గ్రామాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్నా మోహన్‌రావు,అంగన్వాడీ టీచర్లు సండ్ర పుష్పలత, కవిత, లక్ష్మీకాంతం, పద్మ, ఆశ కార్యకర్తలు కొక్కిరేణి రమ, నలగాటి రజిని, నలగాటి విజయలక్ష్మి, కనకం మరియమ్మ పాల్గొన్నారు.
పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి
ముదిగొండ జూలై 15: పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీపీవో హరిప్రసాద్ అన్నా రు. మండలంలోని న్యూ లక్ష్మీపురం, ముదిగొండ గ్రామల్లో జరుగుతున్న ఫ్రైడే, డ్రై డే పనులను, నర్సరీ, డంపింగ్ యార్డ్, వైకుంఠధామాలు, పరిసరాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగీ, మలేరియా వ్యాపించకుండా నీరు నిల్వకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శులు రాంబాబు, సంపత్, సిబ్బంది పాల్గొన్నారు.
తిరుమలాయపాలెంలో ఫ్రైడే డ్రైడే
తిరుమలాయపాలెం, జూలై 15: మండలంలోని కొక్కెరేణి, ఎర్రగడ్డ, తిరుమలాయపాలెం, పిండిప్రోలు, దమ్మాయిగూడెం, బీరోలు, జల్లేపల్లి, పాతర్లపాడు, గోల్‌తండా గ్రా మాల్లో శుక్రవారం ఫ్రైడే డ్రైడే నిర్వహించారు. సైడు కాల్వలు, నీటి నిల్వ గుంతల్లో బ్లీచింగ్ చల్లారు. ఇళ్లలోని తొట్లల్లో ఉన్న నీటిని తొలిగించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో జయరామ్, ఎంపీవో రాజేశ్వరీ, సర్పంచ్‌లు పాల్గొన్నారు.