ఖమ్మం, జూలై 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మూడు దశాబ్దాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో ప్రవహిస్తున్నది. వరదల ధాటికి భద్రాచలంపాటు నది పరివాహకంలోని చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపహాడ్ మండలాలు అతలాకుతలమవుతున్నవి. శుక్రవారం 70 అడుగులకు పైగా ప్రవాహం చేరుకున్నది. ఎగువ నుంచి 23 లక్షల క్యూసెక్కుల నీరు నదిలో చేరుతున్నది. సాయంత్రం 6 గంటలకు 71 అడుగులకు ప్రవాహం చేరుకున్నది. గోదావరి కరకట్ట ప్రాంతంలోని స్నానగట్టాలు, ఉప ఆలయాలు పూర్తిగా నీట మునిగాయి. కరకట్ట ప్రాంతంలో రాకపోకలను అధికారులు నియంత్రించారు. కరకట్ట నుంచి స్లూయిజ్ ద్వారా వరద లీక్ కాకుండా నీటి పారుదలశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అర్ధరాత్రి వరకు 75 అడుగుల వరకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కలెక్టర్ అనుదీప్ ముంపు ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారు.
సహాయక చర్యలు ముమ్మరం..
లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గురువారం సాయంత్రం నుంచి 48 గంటల పాటు భద్రాచలం బ్రిడ్జిపై రాకపోకలను నిషేధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారమూ నిషేధం కొనసాగింది. దీంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే వాహనాలు, అటు నుంచి రాష్ర్టానికి వచ్చే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. శనివారం సాయంత్రం వరకు రాకపోకల నిలిపివేత అమలులో ఉంటుంది. వరద ప్రవాహాన్ని బట్టి రాకపోకలపై కలెక్టర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జిల్లాలో సహాయక చర్యల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను నియమించింది. వరద సమాయక చర్యలను నేరుగా పర్యవేక్షించేందుకు నలుగురు సీనియర్ ఆర్డీవోలను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపహాడ్ మండలాల్లో జల దిగ్బంధంలో ఉన్న గ్రామాల స్థితిగతులను భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, ఖమ్మం సీపీ విష్ణు వారియర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో సహాయక చర్యలకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించుతున్నట్లు వరంగల్ జోన్ ఐజీ నాగిరెడ్డి, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అజయ్ ప్రకటించారు.
రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్..
వరద దృష్ట్యా ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందం, సింగరేణి బృందం, 68 మంది సైనిక దళం, 10 మంది వైద్యులు, 23 మంది ఇంజినీరింగ్ అధికారులు, 210 మంది గజఈత గాళ్లను అందుబాటులో ఉంచింది. నాటు పడవలు, లాంచీలు, చిన్న బోట్లతో పాటు అగ్నిమాపకశాఖకు చెందిన ఏడు పడవలు, హెలికాఫ్టర్, లైఫ్ జాకెట్లు అందుబాటులోకి వచ్చాయి.
మంత్రి పువ్వాడ పర్యవేక్షణ..
మంత్రి అజయ్ భద్రాచలంలోనే బస చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. గోదావరి వరదలపై మంత్రి అజయ్‌కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. సహాయక చర్యలను సమీక్షించారు. ముంపువాసులకు అందుతున్న సేవలకు మంత్రి అజయ్‌ని అభినందించారు. మంత్రి అజయ్ సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్న తీరుపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఫొటోలు షేర్ చేస్తూ ప్రశసించారు. సీఎస్ సోమేశ్‌కుమార్ వరద ఉధృతి, సహాయక చర్యలపై మంత్రి పువ్వాడ, కలెక్టర్, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఐటీసీలో నిలిచిన ఉత్పత్తి
సారపాక, జూలై 15: వరదల నేపథ్యంలో సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో శుక్రవారం రాత్రి నుంచి యాజమాన్యం ఉత్పత్తిని నిలిపివేసింది. ఇలాగే 1986లోనూ వరదలు వచ్చి పేపర్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు పారిశ్రామిక వర్గాలు తెలిపాయి. గతంలో కరోనా లాక్డౌన్ సమయంలోనూ కొన్నిరోజుల పాటు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. తాజాగా మరోసారి ఉత్పత్తి నిలిచింది.
ప్రజాప్రతినిధులకు సూచనలు..
వరద సహాయ చర్యలను మంత్రి అజయ్ పర్యవేక్షిస్తున్నారు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులతో మాట్లాడారు. ముంపు ప్రాంతాల్లో జడ్పీ చైర్మన్ కనకయ్యతో కలిసి పర్యటించారు. ప్రభావిత గ్రామాల్లో ప్రజలందరినీ సురక్షితమైన పునరావాస కేంద్రాలకు తరలించాలని, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
భయపడాల్సిన పనిలేదు: మంత్రి
భద్రాచలానికి వరద ఎంత వచ్చినా ఇబ్బంది లేదని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని మంత్రి అజయ్ అన్నారు. గోదావరి ప్రవాహాన్ని సమీక్షిస్తూ మూడు రోజులుగా భద్రాచలంలోనే ఉంటున్న ఆయన.. శుక్రవారం కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కూడా భద్రాచలం వచ్చి పునరావాస కేంద్రాల్లోని బాధితులను పరామర్శించారు.
ముంపులో 95 గ్రామాలు..
గోదావరి ఉప్పొంగడంతో దాని పరివాహకంలోని 95 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలను వేగిరం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరిస్తున్నారు. ఇప్పటి వరకు భద్రాద్రి జిల్లాలో 95 ముంపు గ్రామాల్లోని 21 వేల మందికి పైగా వరద ప్రభావిత ప్రజలను 77 పునరావాస కేంద్రాలకు తరలించారు.
సీఎంకు మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు
గోదావరి వరద పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తూ అడిగినవన్నీ క్షణాల్లో సమకూర్చిన సీఎం కేసీఆర్‌కు మంత్రి అజయ్ కృతజ్ఞతలు తెలియజేశారు. రక్షణ చర్యల్లో భాగంగా తన విజ్ఞప్తి మేరకు హెలీకాఫ్టర్ సమకూర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. గంటల వ్యవధిలోనే ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి బృందాల ను పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.