ఖమ్మం/ రఘునాథపాలెం, జూలై 12: పేదలకు అన్ని రకాల వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం 2వ డివిజన్ పాండురంగాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాండురంగాపురానికి బస్తీ దవాఖాన మంజూరు చేసి వైద్యురాలిని కేటాయించినట్లు చెప్పారు. వైద్యులు కూడా నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బస్తీ దవాఖానకు అవసరమైన వస్తువుల కొనుగోలుకు సహకరించిన దాతలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. దానిలో భాగంగానే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. 45 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.27.70 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ కింద నియోజకవర్గంలో ఇప్పటికి రూ.12.32 కోట్లను 2,946 మంది లబ్ధిదారులకు అందించినట్లు వివరించారు.
పారిశుధ్యం మెరుగ్గా ఉండాలి..
తెలంగాణలో హైదరాబాద్ తరువాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఖమ్మం మాత్రమేనని మంత్రి అజయ్ పేర్కొన్నారు. అలాంటి నగరంలో పారిశుధ్యం ఎల్లప్పుడూ మెరుగ్గా ఉండాలని సూచించారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ, ఇతర పనుల నిమిత్తం నూతనంగా కొనుగోలు చేసిన కేస్ 770 ఈఎక్స్ అధునాతన జేసీబీని కేఎంసీ కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం డీఆర్ఎఫ్ సిబ్బందికి రెయిన్ కోట్లు, సేఫ్టీ దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగర అవసరాల రీత్యా చెత్త ఎత్తివేసే ట్రాక్టర్లు, ఆటోలను పెంచామని, కార్మికుల సంఖ్యను రెట్టింపు చేశామని అన్నారు. వర్షాకాలంలో డీఆర్ఎఫ్ సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ఏ సమయంలో ఫోన్ వచ్చినా వెంటనే ఆ స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పునుకొల్లు నీరజ, ఆదర్శ్ సురభి, బచ్చు విజయ్‌కుమార్, పగడాల శ్రీవిద్య, పగడాల నాగరాజు, కమర్తపు మురళి, దండా జ్యోతిరెడ్డి, పొన్నం వెంకటేశ్వర్లు, కన్నం ప్రసన్నకృష్ణ, మాటేటి కిరణ్‌కుమార్, రంగారావు, డాక్టర్ మాలతి, స్రవంతి, మలీదు వెంకటేశ్వర్లు, నర్రా యల్లయ్య, కుర్రా మాధవరావు, జోగుపర్తి ప్రభాకర్, వలీ, చిలుమూరు కోటి, తంగెళ్లపల్లి శ్రీనివాస్, సన్నే మోహన్‌రావు, హెచ్ ప్రసాద్, వంటికొమ్ము శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ ఫయాజ్, యల్లంపల్లి హనుమంతరావు, షేక్ రజీం, మల్లేశం, ఫాతిమా, మక్బుల్, బుర్రి వెంకట్‌కుమార్, తాజుద్దీన్, వెంకటేశ్వర్లు, సుధాకర్, నర్సింహారావు, ఆష్రిఫ్ తదితరులు పాల్గొన్నారు.