ఖమ్మం, జూలై 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాచలం వద్ద గోదావరి కాస్త శాంతించింది. మంగళవారం ఉదయం వరకు మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు పైన వరద ఉధృతి కొనసాగగా.. ఉదయం 8 గంటల నుంచి స్వల్పంగా వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రవాహం కొంతమేరకు తగ్గినా గోదావరి పరవళ్లు తొక్కుతూనే ఉంది. ఇంకా పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపహాడ్ మండలాల్లో పునరావాస, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భద్రాచలం పట్టణంలోని పలు వీధుల్లోకి గోదావరి వరదనీరు చేరింది. ప్రధానంగా రామాలయం సమీపంలోని వీధులు రెండోరోజూ జలదిగ్బంధంలోనే ఉన్నాయి.
అన్నప్రసాద కేంద్రం, విస్తా కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లోని వరద నీరు తగ్గలేదు. కాగా అన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు సోమవారం రాత్రి భద్రాచలంలోనే బస చేసిన మంత్రి అజయ్ సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం వరద పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. మరోవైపు చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తోంది. గేట్లను పూర్తిగా ఎత్తివేసి దిగువన ఉన్న గోదావరిలోకి వరదనీటిని విడుదల చేశారు. భద్రాచలంలోని కరకట్ట వద్దకు వెళ్లిన మంత్రి అజయ్.. వరద ఉధృతిని పరిశీలించి అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.
మరోవైపు భద్రాచలం నుంచి వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారిపై వరదనీరు మంగళవారం నిలిచి ఉండడంతో రాకపోకలు స్తంభించాయి. ఆయా మండలాల్లోని పునరావాస కేంద్రాలను కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ పరిశీలించారు. ఆదివారం రాత్రి నుంచి వరద నీటి ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టినా ప్రతి గంటకూ ఒకటి, రెండు పాయింట్లకు మించి తగ్గలేదు. మంగళవారం ఉదయం 6 గంటలకు 53 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం ఉదయం 8:30 గంటలకు 52.9 అడుగులకు తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రం 6 గంటలకు 51.8 ఉన్న వరద ఉధృతి క్రమేణా తగ్గుతూ వచ్చింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద ప్రవాహం పెరిగితే మళ్లీ భద్రాచలంలో నీటిమట్టం పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనికితోడు ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వివిధ బ్యారేజీల నుంచి లక్షల క్యూసెక్కుల్లో వరద నీరు విడుదలవుతోంది.

వదలని ముసురు:మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం
ముసురు వదలడం లేదు. ఐదు రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వార్షాలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగున్నాయి. దీంతో చెరువులు, కుంటలు మత్తడి దంకుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికీ కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక కార్యక్రమాల్లో యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. పలువురు ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. చెరువుల తూములను అధికారులు పరిశీలిస్తున్నారు. కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామం సమీపంలో ముసురు కారణంగా డీసీఎం వ్యాన్ బోల్తాపడడంతో కొద్ది సేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బేతుపల్లి పెద్ద చెరువు పూర్తిగా నిండిపోవడంతో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నీటి లాకులు వదిలారు. తిరుమలయపాలెం మండలంల జగన్నాథపురంలో భారీ వృక్షం కూలడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యటించారు. పాలేరు రిజర్వాయర్‌ను ఎస్ఈ నర్సింహరావు, ఈఈ సమ్మిరెడ్డి, డీఈ రమేశ్‌రెడ్డి పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 19.03 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సత్తుపల్లి మండలంలో 30.6 మిల్లీమీటర్ల వర్షం కరిసింది.