మణుగూరు టౌన్/ పినపాక/ సారపాక, జూలై 11: ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచించారు. గోదావరి వరద తగ్గే వరకూ గ్రామాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఆయా మండలాల్లో అధికారులు ఇప్పటికే పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారని, వాటిల్లో భోజనం సహా అన్ని వసతూలూ కల్పించారని అన్నారు.
భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో వరదల వల్ల ముంపునకు గురైన ప్రాంతాలను, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సోమవారం ఆయన పరిశీలించారు. మణుగూరు మండలంలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన చిన్నరాయిగూడెం, రామానుజవరం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇన్‌టేక్‌వెల్ వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. వరదల నేపథ్యంలో పార్టీ శ్రేణులు కూడా ప్రజలకు తమవంతు సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
వర్షాలు వస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. అనంతరం ఓ లబ్ధిదారుడికి దళితబంధు కింద మంజూరైన వాహనాన్ని స్థానిక అంబేద్కర్ సెంటర్లో పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని జానంపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి ముంపు బాధితులతో మాట్లాడారు. ఇదే మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాలైన చింతల బయ్యారం, సింగిరెడ్డిపల్లి, భూపతిరావుపేట, టీ కొత్తగూడెం గ్రామాలను పరిశీలించారు.
అనంతరం బూర్గంపహాడ్ మండలం సారపాకలోని బీపీఎల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కూడా ప్రభుత్వ విప్ పరిశీలించారు. ఆయా మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు నాగరాజు, కోట వీరబాబు, మాధవి, ముత్యం రమేశ్, పోశం నర్సింహారావు, జావీద్‌పాషా, ముత్యం బాబు, అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి, వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, ఆవుల నర్సింహారావు, భూశెట్టి రవి, విక్రమ్‌కుమార్, శ్రీనివాసులు, శ్రీనివాస్, వీరభద్రం, బాలకృష్ణ, పగడాల సతీశ్, బూర రాజగోపాల్, టీవీఆర్ సూరి, భగవాన్‌రెడ్డి, స్పందన, కంది మహేశ్, కామిరెడ్డి శ్రీలత, గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీశ్, వల్లూరిపల్లి వంశీకృష్ణ, శ్రీను పాల్గొన్నారు.