భద్రాచలం, జూలై 11: గోదావరి వరద 60 అడుగులొచ్చినా భయపడాల్సిన పనిలేదని, ముంపు ప్రాంతాల ప్రజలు అధైర్య పడొద్దని, తామంతా అండగా ఉంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భరోసా ఇచ్చారు. ‘గోదావర వరదలు – సహాయక చర్యల’పై భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
గోదావరి వరదలొస్తే తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం సమీక్ష నిర్వహించాలనుకున్నామని, ఈలోగా అసాధారణంగా వరద రావడంతో 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశామని అన్నారు. ఎగువున కురుస్తున్న వర్షాలతోపాటు సమ్మక్క, మేడిగడ్డ బ్యారేజీల నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ వరద నీటి కారణంగా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం ఉధృతంగా పెరిగిందని అన్నారు.
మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటికీ కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్, జిల్లా అధికారులు ముందుగానే స్పందించి అన్ని ఏర్పాట్లూ చేశారని ప్రశంసించారు. విస్తా కాంప్లెక్స్‌తోపాటు లోతట్టు ప్రాంతాల్లో మోటార్లు ఏర్పాటు చేసి నీటిని ఎప్పటికప్పుడు తోడుతున్నట్లు చెప్పారు. వరద నీటిని తోడేందుకు అదనపు మోటార్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కాజ్‌వేలు నిండిపోయి ఉన్నందున ప్రజలు రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నీరు నిలిచి ఉన్న కాజ్‌వేలపై నుంచి ఆర్టీసీ బస్సులను నడపొద్దని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. అత్యవసర వైద్య సేవల కోసం మందులు సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ జిల్లాలో 17 ప్రాంతాల్లో వరద నీరు రహదారులపైకి చేరిందని, ఆయా ప్రాంతాల్లో రాకపోకలను నిలిపివేశామని అన్నారు.
జిల్లాలో 2,345 ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయని, కట్టల పరిరక్షణకు 21 వేల ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచామని అన్నారు. 15 రోజుల్లోపు ప్రసవ తేదీలు ఉన్న 32 మంది గర్భిణులను గుర్తించి ఆసుపత్రులకు తరలించామన్నారు. ప్రతి మండలంలో సహాయక చర్యలు పర్యవేక్షణకు సెక్టోరల్ అధికారులను నియమించినట్లు చెప్పారు. కలెక్టర్, ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, ఐటీడీఏ పీవో గౌతమ్, ఎస్పీ వినీత్, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఏఎస్పీ రోహిత్‌రాజ్, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు వరద సహాయక చర్యలపై కలెక్టర్ అనుదీప్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.
సహాయక చర్యలకు అధికారులు సంసిద్ధంగా ఉండాలి

ఖమ్మం, జూలై 11: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. ఖమ్మం కాల్వొడ్డు సమీపంలోని మున్నేరు పరీవాహక ప్రాంతాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. వరద ఉధృతిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. వరద ఉధృతి పెరిగితే ముంపు ప్రాంతాల ప్రజలకు స్థానిక నయాబజార్ కళాశాలలో పునరావాసం కల్పించనున్నట్లు చెప్పారు. వారికి భోజనం, తాగునీరు సహా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.
సహయక చర్యల కోసం అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని, అయినప్పటికీ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పొంగుతున్న వాగుల వద్ద హెచ్చరికలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ దారులను సూచించే గుర్తులు ఏర్పాటు చేశామన్నారు. వర్షాకాలంలో గ్రామాల మధ్య ఉన్న చిన్న చిన్న వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్‌పై మొక్కలను నాటారు. వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, కేఎంసీ కమిషనర్ ఆదర్శసురభీ, మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఇరిగేషన్ సీఈ శంకర్‌నాయక్, ఆర్డీవో రవీంద్రనాథ్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, ఇరిగేషన్ డీఈ ఉదయ్‌ప్రతాప్, తహాసీల్దార్ శైలజ, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.