ఖమ్మం వ్యవసాయం, జూన్ 22 : వానకాలం రైతుబంధు సొమ్ము పంపిణీకీ ముహూర్తం ఖరారైంది. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గత సీజన్లో మాదిరిగానే ఈ సీజన్లో సైతం అంచెలంచెలుగా రైతుబంధు సొమ్ము రైతుల ఖాతాల్లో జమకానుంది. తద్వారా జిల్లావ్యాప్తంగా కేవలం పదిరోజుల వ్యవధిలోనే సుమారు రూ. 360-370 కోట్లు జమ కానున్నాయి. ఒకటి రెండ్రోజుల్లో నిధులను ఆర్థికశాఖ ట్రెజరీకి విడుదల చేయనుంది. ఎవరికైనా సొమ్ము జమకాని పక్షంలో సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామాల వ్యవసాయశాఖ విస్తరణ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. బ్యాంకు ఖాతాలో తప్పిదాలు, ఇతర ఎలాంటి సమస్య ఉన్నా జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో సైతం నిరంతరం సేవలు అందించనున్నారు.