మామిళ్లగూడెం, జూన్ 21 : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఖమ్మం జిల్లాలో చేపడుతున్న రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో అధికారులతో పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విస్తరణ పనులకు ఆటంకం కలగకుండా భూ సేకరణ, నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సుమారు రూ.1,566 కోట్లతో చేపడుతున్న సూర్యాపేట- ఖమ్మం విభాగం నాలుగు వరుసల జాతీయ రహదారి పనులు 85శాతం పూర్తయినట్లు మిగతా పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సుమారు రూ.1,039 కోట్లతో చేపడుతున్న కోదాడ- ఖమ్మం విభాగం నాలుగు వరుసల జాతీయ రహదారి పనులు 15శాతం పూర్తయినట్లు ఈ పనులు జనవరి-2022లో ప్రారంభించగా 24 నెలల్లో పూర్తి చేయాల్సి ఉందన్నారు.
ఖమ్మం- దేవరపల్లి నాలుగు లైన్ల రహదారి ప్యాకేజీ-1, 2, 3 పనుల కోసం అవార్డు చేశామని వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఖమ్మం- దేవరపల్లి రహదారి నాలుగు వరుసల జాతీయ రహదారి గ్రీన్ ఫీల్డ్‌గా నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. భూసేకరణలో నిర్మాణాల అన్నింటిని సర్వే చేసి పరిహారం అందించేందకు చర్యలు చేపట్టాలన్నారు. ఇండ్ల వారిగా కట్టడాలు, టాయిలెట్లు, ప్రహరీలు, తదితరాలన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. రహదారి పనులకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఎన్హెచ్ఐ పీడీ దుర్గాప్రసాద్, ఏడీ సర్వేస్ రాము, ఎన్హెచ్ఐ మేనేజర్లు పద్మ, దివ్య, తహసీల్దార్లు పాల్గొన్నారు.
దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తిచేయాలి
దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్లో దళితబంధు సెక్టార్ యూనిట్ గ్రౌండింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో చింతకాని మండలంతోపాటు నియోజకవర్గాల స్థాయిలో దళితబంధు లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. చింతకాని మండలంలో 3,427 మంది లబ్ధిదారులకు 1,214 యూనిట్లను, ఐదు నియోజకవర్గాల పరిధిలో 483 మంది లబ్ధిదారులకు 108 యూనిట్లను గ్రౌండింగ్ చేయడం జరిగిందన్నారు.