ఖమ్మం కల్చరల్, జూన్ 20: తొలి తెలుగు సినీ గేయ రచయిత చందాల కేశవదాసు సేవలు చిరస్మరణీయమని పలువురు స్మరించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీచందాల కేశవదాసు కళా పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన కేశవదాసు 146వ జయంతి సభలో పలువురు వక్తలు మాట్లాడారు. తొలుత చందాల కేశవదాసు చిత్రపటానికి పూలమాలలు వేశారు. సభకు కళా పరిషత్ అధ్యక్షుడు కొండపల్లి జగన్మోహన్రావు అధ్యక్షత వహించగా.. కేశవదాసు జీవిత సాహిత్య పరిశోధకుడు డాక్టర్ పురుషోత్తమాచార్యులు, రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు తడకమళ్ల రామచందర్రావులు కేశవదాసు సాహితీ సేవలను వివరించారు. ఎస్బీఐటీ చైర్మన్ ఆర్జెసీ కృష్ణ, వనం కృష్ణారావు, డాక్టర్ సుబ్బరాజు పాల్గొన్నారు.
ఆలోచింపజేసిన యయాతి గాథ..
అనంతరం మధిర సుమిత్ర యూత్ అసోసియేషన్ కళాకారులు ప్రదర్శించిన ‘యయాతి’ నాటకం ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేసింది. శారీరక వాంఛతో సహజ వృద్ధాప్యాన్ని తిరస్కరించి, కృత్రిమ యవ్వనాన్ని పొందడానికి ప్రయత్నించి చివరకు పశ్చాత్తాపం చెందిన యయాతి గాథ ఆలోచింపజేసింది. నేటి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూ వ్యక్తిత్వ మానసిక పరివర్తనను చాటే యయాతి పాత్ర ఆకట్టుకుంది. నాటక ప్రయోక్త, పరిశోధకుడు డాక్టర్ నిభానపూడి సుబ్బరాజు దర్శకత్వంలో ప్రదర్శించిన ఈ నాటకంలో వసంత్, రమణ, రాజేందర్, సాంబశివరెడ్డి, కా్రంతి పలు పాత్రలలో నటించి మెప్పించారు.