ఖమ్మం వ్యవసాయం, జూన్ 15: నైరుతి రుతుసవనాల ప్రభావంతో రెండు రోజుల నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. తద్వారా ఉమ్మడి జిల్లా ప్రజలు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ క్రమంలో నైరుతి రుతుపవనాలు రాష్టంలోకి ప్రవేశించడంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో మరోమారు బుధవారం రాత్రి ఖమ్మం నగరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పాలేరు, మధిర, వైరా సహా సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఆయా మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి కొంత ఎండవేడిమి ఉన్నప్పటికీ సాయంత్రం చలిగాలులు వీయడం, అనంతరం భారీ వర్షం కురవడంతో నగర వాసులు సంతోషం వ్యక్తం చేశారు.