ఖమ్మం జిల్లాలో మిల్లర్లు ప్రతి సీజన్లో 100 శాతం సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారు. గతంలో ప్రభుత్వ యంత్రాంగం ఒకటికి రెండుసార్లు గడువు పొడిగించినా.. మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. దీంతో నిర్దేశించిన లక్ష్యం పూర్తి కాకపోయేది. కానీ, రెండు సీజన్ల నుంచి మిల్లర్లు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడంతో లక్ష్యం దిశగా అడుగులు వేసింది. ఈ సారి 100 శాతం బియ్యాం సేకరణలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. అయితే, మిల్లర్లు తీసుకున్న ధాన్యానికి సంబంధించిన బియ్యం అందజేయడానికి ఈ సీజన్‌కు సంబంధించి జూలై ఆఖరు నాటికి గడువు ఉంది. అది దాటితే మిల్లర్లకు నోటీసులిచ్చే అవకాశం ఉంది. కానీ జిల్లాలో అలాంటి పరిస్థితి ఉండదని, నిర్దేశించిన సమయంలోగానే బియ్యాన్ని మిల్లర్లు అందిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. – ఖమ్మం, జూన్ 8
ఖమ్మం, జూన్ 8 : తెలంగాణ ఏర్పడక ముందు మిల్లర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా ఉండేది. అధికారులు కూడా మామూళ్లకు అలవాటు పడి వారివైపు చూసేవారు కాదు. అలాంటిది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం.. గతంలో కంటే పదింతలు రెట్టింపు స్థాయిలో ధాన్యం దిగుబడులు రావడం.. ఒకవైపు మిల్లర్లకు లాభాలు తెచ్చిపెడుతుండగా మరోవైపు మాత్రం వారి అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లయ్యింది. కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ద్వారా రైస్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చి వారి ద్వారా బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకునేవారు. వీటిలో ప్రజా పంపిణీకి అవసరమయ్యేంత తీసుకుని మిగతాది ఎఫ్‌సీఐకి ఇచ్చేవారు. ఈ క్రమంలో మిల్లర్లు ధాన్యం తీసుకున్నప్పటికీ బియ్యం ఇచ్చే వారు కాదు. అధికారులు ఎంత వెంట పడ్డా వారు పట్టించుకునే వారు కాదు.
ఏండ్ల తరబడి బియ్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసే మిల్లర్లు కూడా జిల్లాలో ఉండేవారు. ఆ బియ్యం మిల్లులో నిల్వ ఉంచుకొని రేషన్ బియ్యం దందా చేసేవారు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా అధికారులు తనిఖీలకు వస్తే సీఎంఆర్ బియ్యం చూపేవారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఆ పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు ఏ సీజన్లో ఆ సీజన్‌కు సంబంధించిన బియ్యాన్ని మిల్లర్లు ఇస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మిల్లరు నిర్దేశిత సమయంలో బియ్యం ఇవ్వకపోతే సంబంధిత మిల్లర్లకు నోటీసులు ఇచ్చి బ్లాక్‌లో పెడుతున్నారు. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం మిల్లర్లు 2019 నుంచి ఇప్పటివరకు ప్రతి సీజన్లో 100శాతం సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందిస్తున్నారు. రాష్ట్రంలోనే 100శాతం బియ్యాన్ని సేకరించే జిల్లాలో ఖమ్మం రెండో స్థానంలో నిలవడం వెనుక జిల్లా అధికారుల పాత్ర ఎంతో ఉందని పలువురు పేర్కొంటున్నారు.

100శాతం లక్ష్యం పూర్తి
ఖమ్మం జిల్లాలో 57మిల్లులు ఉన్నవి. 2021-22 వానకాలానికి సంబంధించి 2లక్షల 85వేల 535 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి జిల్లాలోని 57 మిల్లులకు గాను 2లక్షల 78వేల 535 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కింద ఇవ్వగా 1 లక్ష 86వేల 618 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 1 లక్ష 28వేల 628 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చారు. వీటిలో ప్రజా పంపిణీ కింద 90వేల 959 మెట్రిక్ టన్నులు, ఎఫ్‌సీఐకి 37వేల 668 మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చారు. కాగా 68.92 శాతం బియ్యంను ఇవ్వగా మిగిలినవి జూలై ఆఖరు నాటికి ఇచ్చే గడువు ఉంది. 2020-21 యాసంగి సీజన్లో జిల్లాలో 3 లక్షల 61వేల 997 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి జిల్లాలోని 44 మిల్లులకు 1 లక్ష 11వేల 136 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్‌కు ఇవ్వగా వీటికి గాను 74వేల 965 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 100శాతం బియ్యాన్ని మిల్లర్లు ఇచ్చారు. వీటిలో ప్రజా పంపిణీకి 30,319 మెట్రిక్ టన్నులు, ఎఫ్‌సీఐకి 44వేల 536 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చారు.
2020-21 ఖరీఫ్‌లో 2లక్షల 56వేల 946 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా 1 లక్షా 89వేల 729 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 55మిల్లులకు సీఎంఆర్ కింద 1లక్ష 89వేల 729 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చారు. వీటిలో మిల్లర్లు నిర్దేశిత సమయంలోగానే రావాల్సిన 1లక్షా 27వేల 118 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 100శాతం ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రజా పంపిణీకి 79వేల 841 మెట్రిక్ టన్నులు, ఎఫ్‌సీఐకి 47వేల 212 టన్నుల బియ్యాన్ని ఇచ్చారు. 2019-20 ఖరీఫ్ నుంచి ఇప్పటివరకు ప్రతి సీజన్లో మిల్లర్లు 100శాతం సీఎంఆర్ ఇస్తున్నారు.
ఫలిస్తున్న చర్యలు..
ఏటా ప్రభుత్వ యంత్రాంగం ఒకటికి రెండుసార్లు గడువు పొడిగించినా లక్ష్యం పూర్తయిన సందర్భాలు అరుదు. కానీ రెండు సీజన్ల నుంచి ముందే మిల్లర్లు మేల్కొంటున్నారు. ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చే క్రమంలో మిల్లర్లు అక్రమాలకు పాల్పడకుండా గతంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. మిల్లర్లు తీసుకున్న ధాన్యానికి సంబంధించిన బియ్యం అందజేయడానికి ఈ సీజన్‌కు సంబంధించి జూలై ఆఖరు నాటికి గడువు ఉంది. అది దాటితే మిల్లర్లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.. కానీ ఖమ్మం జిల్లాలో అలాంటి పరిస్థితి ఉండదని, నిర్దేశించిన సమయంలోగానే బియ్యంను మిల్లర్లు అందిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.