భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ఈ నెల 12న నిర్వహించనున్న టెట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ‘టెట్ నిర్వహణ, మన ఊరు – మన బడి, పట్టణ ప్రగతి’ కార్యక్రమాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఉదయం జరుగనున్న పరీక్షకు 40 కేంద్రాలు, మధ్యాహ్నం జరుగనున్న పరీక్షకు 32 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొత్తం 8 రూట్లుగా విభజించి పర్యవేక్షణకు 8 మంది సీనియర్ అధికారులను నియమించినట్లు చెప్పారు. విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలని డీఈవోకు సూచించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ వల్ల మంచి ఫలితాలు వస్తున్నందున ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.
స్థానికంగా గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 18 వరకు నిరంతర పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. ‘మన ఊరు – మన బడి’లో ఎంపిక చేసిన 33 పాఠశాలలకు పరిపాలనా అనుమతులు, మంజూరు కోసం ఫైళ్లు సమర్పించాల్సి ఉన్నదన్నారు. వాటి అనుమతి కోసం సత్వరమే ఫైళ్లు పెట్టాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఎస్ఎంసీల తీర్మానం ద్వారా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎఫ్టీవోలు జనరేట్ చేయాలని, ప్రతి రోజూ నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ఇల్లెందు, మణుగూరు, చర్ల మండలాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు తక్షణమే స్థల సేకరణ పూర్తి చేయాలని డీఆర్వోకు సూచించారు. దళితబంధు పథకంలో గ్రౌండింగ్ చేసిన యూనిట్ల మంజూరుకు చర్యలు చేపట్టాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఆదేశించారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డీఈవో సోమశేఖరశర్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముత్యం, డీఆర్వో అశోక చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.