ఖమ్మం, జూన్ 6: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది పేదలకు లబ్ధి చేకూరుతున్నది. 2014 జూన్ 2 నాటికి ఎవరైతే ఆక్రమిత ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్నారో అలాంటి పేదల ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో 58 జీవో కింద 9,398 దరఖాస్తులు, 59 జీవో కింద 3,620 దరఖాస్తులొచ్చాయి. వాటన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి హక్కులు కల్పించనున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు జిల్లాలో 44 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందానికి ఒక జిల్లా స్థాయి ఉన్నతాధికారి నేతృత్వం వహించనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 58 ప్రకారం 125 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారిని గుర్తించి యాజమాన్య హక్కులు కల్పించనున్నది. జిల్లావ్యాప్తంగా 13,018 దరఖాస్తులు రాగా.. ఖమ్మం కార్పొరేషన్లోనే సుమారు 7 వేల దరఖాస్తులు వచ్చాయి.
తెలంగాణ ప్రభుత్వం అనేక చరిత్రాత్మక నిర్ణయాలకు వేదికగా నిలుస్తోంది. అనేక రంగాల్లో దేశానికే ఆదర్శమవుతోంది. తాజాగా మరో నిర్ణయం తీసుకోవడంతో వేలాది మంది పేదలకు మేలు చేకూరనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2 నాటికి ఎవరైతే ఆక్రమిత ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారో అలాంటి పేదలకు సంబంధించిన ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. 58, 59 జీవోల ద్వారా ఆయా పేదలు ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాలలను క్రమబద్ధీకరిస్తున్నారు..దీని కోసం ప్రత్యేకంగా దరఖాస్తులు స్వీకరించారు.
ఖమ్మం జిల్లాలో 58 జీవో కింద 9,398 దరఖాస్తులు, 59 జీవో కింద 3,620 దరఖాస్తులు వచ్చాయి. వాటన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చిన మొత్తం 13,018 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లాలో 44 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందానికి ఒక జిల్లా స్థాయి ఉన్నతాధికారి నేతృత్వం వహించనున్నారు. జీవో 58 ప్రకారం 125 గజాల స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి యాజమాన్య హక్కులు కల్పించనున్నారు.
అందుకు జిల్లా యంత్రాంగం పారదర్శకంగా అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమయింది. జిల్లాలోని 21 మండలాల్లో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించనున్నారు. ఒక్కో బృందంలో ఒక జిల్లా స్థాయి అధికారి, రెవెన్యూ అధికారి, సర్వేయర్ తదితర అధికారులు ఉన్నారు. కాగా ఖమ్మం జిల్లాలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో సగానికి పైగా సుమారు 7 వేల దరఖాస్తులు ఖమ్మం కార్పొరేషన్లోనే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
విస్తీర్ణం ఆధారంగా ధరలు..
తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు పెరిగాయి. పేదలు నివసిస్తున్న భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఖమ్మం నగరం పాటు ఖమ్మం రూరల్, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ లాంటి ప్రాంతాల్లో అక్రమార్కులు వెలిశారు. అప్పటికప్పుడు ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని వాటిని క్రమబద్ధీకరించేందుకు చేసిన ప్రయత్నాలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్న సంఘటనలూ అనేకం జరిగాయి.
ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్న నిజమైన పేదలకు అండగా నిలిచేలా 58, 59 జీవోలను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. దశల వారీగా దరఖాస్తు గడువును పొడిగిస్తూ క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. జీవో 58 ప్రకారం 125 చదరపు గజాల్లోపు స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు పూర్తి ఉచితంగా క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. జీవో 59 ప్రకారం నిర్మించుకున్న ఇళ్ల విస్తీర్ణం ఆధారంగా రెగ్యులరైజ్ చేసేందుకు ధరలను ఖరారు చేశారు. జీవోల ప్రకారం ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించి యాజమాన్య హక్కులు కల్పించనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
పకడ్బందీగా పరిశీలన..
ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను రెగ్యులర్ చేసే క్రమంలో అక్రమాలకు ఆస్కారం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా సాంకేతిక అంశాలతోపాటు అధికారులే ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎంపిక చేసిన బృందాల్లో స్థానిక తహసీల్దార్‌కు చోటు కల్పించలేదు. ఇతర శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారితోపాటు సొంత మండలంలో కాకుండా ఇతర మండలాల్లో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్లు, సూపరింటెండెంట్లు, ఆర్ఐలు, వీఆర్ఏలను బృందం సభ్యులుగా నియమించారు. ఇంటి పన్ను రసీదు, విద్యుత్ బిల్లులు, ఆధార్ కార్డు, ఇతర డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.
వారు చేసే వృత్తి ఆధారంగా ఆధాయ ధ్రువీకరణ పత్రాన్ని సైతం పరిశీలిస్తున్నారు. అయితే జిల్లా స్థాయి అధికారులకు మాత్రమే మొబైల్ యాప్ లాగిన్, పాస్వర్డ్ ఇచ్చారు. వీరు దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి దరఖాస్తు నంబరును యాప్‌లో నమోదు చేయగానే వివరాలు ప్రత్యక్షమవుతాయి. తర్వాత ఇంటి యజమాని వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. అలాగే జియో ట్యాగింగ్ కో ఆర్డినేటర్ల సహకారంతో ప్లాట్ విస్తీర్ణం కొలుస్తారు. అంతా పక్కాగా ఉంటే వివరాలు యాప్‌లో నమోదు చేసి తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తారు. ఆ తర్వాత యాజమాన్య హక్కులు కల్పిస్తారు.
కేఎంసీ కమిషనర్ పరిశీలన..
ఖమ్మం నగరంలో 58, 59 జీవోల ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నగర కమిషనర్ ఆదర్శ్ సురభి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను నిశితంగా పరిశీలిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇతర శాఖల అధికారులతో కలిసి నగరంలోని బాలపేట, గణేశ్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించి ఇళ్లను, దరఖాస్తులను పరిశీలించారు.