ఖమ్మం, జూన్ 6: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ‘పట్టణ ప్రగతి’లో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న పనులను సోమవారం మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులతో కలిసి మురుగు తొలగించారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో నిర్దేశించిన పనులను పూర్తి చేయాలని సూచించారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు.
అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో నిర్దేశించిన అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఖమ్మంలో కొనసాగుతున్న పనులను సోమవారం ఆయన స్వయంగా పరిశీలించారు. పీఎస్ఆర్ రోడ్డులో కాల్వలో మురుగు తొలగించే పనులను ప్రారంభించారు. గాంధీచౌక్ సెంటర్లో రోడ్డు మరమ్మతు పనులను పారతో స్వయంగా చేశారు. రాపర్తినగర్లో కచ్చా నాళా శుభ్రం చేసే పనులను ప్రారంభించారు. లక్ష్మీగార్డెన్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభించారు.
ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండదని అన్నారు. కొన్ని చోట్ల పట్టణ ప్రకృతి వనాలు, నర్సరీలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. మరొకొన్ని డివిజన్లలో అనుకున్న పనులు బాగా జరుగుతున్నారు. కానీ ఇంకొన్ని డివిజన్లలో పనులు మంచిగా జరగడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
అలాంటి చోట్ల అధికారులు అలసత్వం వీడాలని సూచించారు. అనంతరం 14, 16, 36, 40, 41, 42, 45 డివిజన్లలో నర్సరీలను పరిశీలించారు. వచ్చే హరితహారం కోసం ప్రభుత్వ లక్ష్యానికి మించి మొకలను సిద్ధం చేయాలని ఆదేశించారు. మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కమిషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, కార్పొరేటర్లు పసుమర్తి రామ్మోహన్, రాపర్తి శరత్, కమర్తపు మురళి, శీలంశెట్టి రమావీరభద్రం, మేడారపు వెంకటేశ్వర్లు, మక్బూల్, బుర్రి వెంకట్‌కుమార్, వలరాజు, టీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, తహశీల్దార్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
పల్లెల్లో పచ్చదనం వెల్లివిరియాలి
రఘునాథపాలెం, జూన్ 6: పల్లెప్రగతితో గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. 5వ విడత పల్లెప్రగతిలో భాగంగా సోమవారం రఘునాథపాలెం మండలం రేగులచలక గ్రామంలో పర్యటించారు. 20 డబుల్ బెడ్ రూం ఇళ్లను, రూ.36 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పల్లె ప్రగతిని సద్వినియోగం చేసుకొని గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
ముందుగా 5వ విడత పల్లెప్రగతిలో భాగంగా నాలుగు రోజుల పాటు జరిగిన పనులపై మంత్రి గ్రామ కార్యదర్శి ఏదునూరి సంగీతను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ కొర్లపాటి రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు కొంటెముక్కల వెంకటేశ్వర్లు, లక్ష్మణ్‌నాయక్, కుర్రా భాస్కర్‌రావు, అజ్మీరా వీరూనాయక్, మాదంశెట్టి హరిప్రసాద్, నున్నా వెంకటేశ్వర్లు, నున్నా శ్రీనివాసరావు, చెరుకూరి భిక్షమయ్య, బోయినపల్లి లక్ష్మణ్‌గౌడ్, యండపల్లి సత్యం, తోట వెంకట్, చల్లమల రామకృష్ణ, నున్నా కిశోర్, ఉయ్యూరు వెంకటనారాయణ, చెన్నబోయిన సైదులు పాల్గొన్నారు.