లక్ష్మీదేవిపల్లి, జూన్ 6 ; ఏడాది వానకాలం పంటల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు వ్యవసాయశాఖ సమాయత్తమవుతోంది. గతేడాది లోపాలను అధిగమిస్తూ పంటల నమోదు ప్రక్రియలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏఈవోలు యాప్ ద్వారా ఈ పంటల నమోదును పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా జిల్లా వ్యాప్తంగా ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగైంది. ఎక్కడైనా దెబ్బతింటే ఎన్ని ఎకరాలు దెబ్బతిన్నది అనే సమాచారం వ్యవసాయశాఖ వద్ద అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ఈ పంటల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సారి మాత్రం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తిస్థాయిలో చేపడుతున్నారు.
ఏఈవోలు యాప్ ద్వారా పంటను బుస్ చేసుకోవచ్చు. ఈ సారి వెబ్సైట్ వర్షన్ అందించారు. క్రాప్ బుకింగ్ ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు చేయాలి. క్రాప్ బుకింగ్ యాప్ రిమోట్ లొకేషన్ ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. రికార్డు చేసిన డాటాను అదేరోజు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య మాత్రమే అప్లోడ్ చేయవచ్చు. పంట విత్తే వారం కచ్చితంగా దగ్గరగా ఉండాలి. దీంతో తదుపరి పంట విత్తిన వివరాలతో జోక్యం చేసుకోదు. క్రాప్ బుకింగ్ యాప్ సంబంధిత క్లస్టర్ల అధికార పరిధిలో పనిచేస్తున్నది.
30 ఎకరాలకు మించకుండా..
ఏఈవో లాగిన్‌లో ఒకేసారి 30 ఎకరాలకు మించకుండా ఐదు సర్వేనంబర్లను ఒకేసారి బుస్ చేసుకోవచ్చు. ఐదువేల ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రాంతాల్లో క్రాప్ బుకింగ్ చేస్తారు. తాత్కాలిక, కాంట్రాక్టు ఏఈవోలను వెంటనే ఆ ప్రదేశాల్లో అధికారులు నియమించాలి. లేకపోతే డీఈవో ద్వారా అలాంటి క్లస్టర్లకు ఏటీఎంఏ సిబ్బందిని కేటాయించాలి. ఏఈవోలు పంట నమోదు చేసిన తర్వాత వారంలో సర్వేనంబర్ల వారీగా మళ్లీ మండల, డివిజన్, జిల్లాస్థాయి అధికారులు నమోదు ప్రక్రియను పర్యవేక్షించి క్రాప్ బుకింగ్ ఎన్హాన్స్మెంట్ యాప్ ద్వారా వందశాతం కచ్చితత్వంతో పంటల నమోదు ప్రక్రియను నిర్వహిస్తారు.
పంట మార్చినా నమోదు..
సరైన కారణాలతో విత్తిన పంట వివరాలతో సవరణలు చేసుకోవచ్చు. మార్చబడిన పంట వివరాలను అందించాలి. ఆమోదం కోసం ఎంఏవో లాగిన్‌కు సమర్పించాలి. ఏఈవోలు తమ క్లస్టర్లలో ఉన్న సర్వేనంబర్ల కోసం స్థానిక పేర్లను గుర్తించి 15 నుంచి 20 రోజుల్లో వాటిని యాప్ లేదా వెబ్సైట్లో నమోదు చేయాలి. ఇచ్చిన సర్వే నంబర్లలో పంటలు ఏ దశలో ఉన్నాయో, పొలాలు, పంటలను గుర్తించడానికి పేర్లు ఏఈవో లాగిన్‌లో డ్రాప్‌డౌన్ అందించబడుతుంది. అందులో వారు లొకేషన్ పేరున రికార్డు చేయాలి.
నమోదుతో లాభాలు…
ఏటా పంటల నమోదు ప్రక్రియతో అనేక లాభాలున్నాయి. ఏ జిల్లాలో ఎంత విస్తీర్ణంలో పంటల సాగైందనే అంశం వ్యవసాయశాఖ వద్ద పూర్తి సమాచారం ఉంటుంది. ఈ కారణంగా పంటల కొనుగోలు సమయంలో ఎంత వరకు ఉత్పత్తి వస్తుంది. ప్రభుత్వం ఎంత వరకు కొనుగోలు చేయవచ్చుననే అంశాలపై ముందస్తుగా ఒక అంచనాకు వస్తాయి. పంట నష్టం జరిగిన సమయంలో ఏ రైతు ఏ సర్వే నంబర్లో ఎంత పంట సాగు చేశారనే వివరాలు పూర్తిగా నమోదై ఉండడంతో రైతులకు లాభం చేకూరుతున్నది. పంట అమ్మకాల సమయంలోనూ రైతులు ఇబ్బంది లేకుండా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
రైతులకు మేలు జరుగుతుంది
ప్రత్యేక యాప్ ద్వారా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంతో రైతులకు మేలు జరుగుతుంది. పంటల వివరాలన్నీ ఈ యాప్‌లో నిక్షిప్తం చేస్తాం. వ్యవసాయ శాఖలో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో రైతులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టింది.
– కరుణశ్రీ, ఏడీఏ కొత్తగూడెం
ఏఈవోలు చేసిన సర్వేను పరిశీలిస్తాం
ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేసిన రైతుల వివరాలను వారానికి ఒకసారి వెరిఫికేషన్ చేస్తాం. ఈ యాప్‌లో పట్టాలు లేని రైతుల వివరాలను మాన్యువల్‌గా నమోదు చేస్తాం. ప్రభుత్వ లక్ష్యాలను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేస్తున్నాం. రైతులకు ప్రభుత్వపరంగా అందే ఫలాలను అందజేస్తున్నాం.
–రాకేశ్, ఏవో లక్ష్మీదేవిపల్లి