ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 6 : పోటీ పరీక్షలు రాసేటప్పుడు అభ్యర్థులు వర్తమానకాలంలో ఉండాలని, పరీక్ష మీదే దృష్టి ఉండాలి తప్ప ఫలితం మీద ఉంచకూడదని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సోమవారం ఖమ్మం పుస్తక మహోత్సవంలో భాగంగా రావెళ్ళ వెంకటరామారావు ప్రాంగణం జాతశ్రీ వేదికపై ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ మైదానంలో జరిగిన ‘పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడం ఎలా’ అనే అంశంపై జరిగిన అవగాహన సదస్సులో కలెక్టర్, పోలీస్ కమిషనర్ విష్ణువారియర్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్‌సురభి, ట్రైనీ ఐపీఎస్ రశ్మీ, ట్రైనీ ఐపీఎస్ సంకీర్త్‌తో కలిసి పాల్గొన్నారు. వారంలో ప్రతిరోజు 5గంటలు చదవాలని సూచించారు.
ట్రైనీ ఐపీఎస్ సంకీర్త్ మాట్లాడుతూ ప్రాంతీయ పత్రికలను నిరంతరం చదువుతూ ఏదైనా జాతీయ పత్రికను చదవాలని సూచించారు. సీపీ విష్ణు వారియర్ మాట్లాడుతూ పాత పశ్నాపత్రాలు, మోడల్ పరీక్షలను ఎక్కువగా సాధన చేయాలన్నారు. తొలుత హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కార్యదర్శి కె.చంద్రమోహన్ స్వాగతం పలకగా కార్యక్రమానికి సమన్వకర్తగా ప్రముఖ విద్యావేత్త ఇంజం వెంకటరమణారావు వ్యవహరించారు. అనంతరం సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాల సమన్వయకర్త అట్లూరి వెంకటరమణ వందన సమర్పణ చేశారు. చివరగా నిర్వాహకులు సీతారాం, ప్రసేన్, మువ్వా శ్రీనివాస్, రవిమారుత్ వక్తలను సన్మానించారు. వివిధ కళాశాలలు, బీసీ స్టడీ సర్కిల్ తదితర ప్రాంతాల నుంచి గ్రూప్-1, 2, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులు వందల సంఖ్యలో హాజరయ్యారు.