కూసుమంచి, జూన్ 4 :పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఊరూరా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి.. రెండో రోజు శనివారం గ్రామగ్రామాన పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు పారిశుధ్యం, డంపింగ్ యార్డుల నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మణుగూరులో పట్టణ ప్రగతి పనులను ప్రారంభించారు. గుండాల మండలంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పల్లె ప్రగతి పనులను పర్యవేక్షించారు. కలెక్టర్ అనుదీప్ లక్ష్మీదేవిపల్లి పరిధిలోని బావోజీ తండా క్రీడాప్రాంగణం, పంచాయతీ నర్సరీని పరిశీలించారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు సుజాతనగర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.
‘పల్లె, పట్టణ ప్రగతి’ కార్యక్రమాలు గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సరైన వేదిక. ఈనెల 3వ తేదీ నుంచి ఐదో విడత పల్లె ప్రగతి, పట్టణ పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 18 వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. కార్యక్రమాల్లో నర్సరీలు, వైకుంఠధామాలు, తడి, పొడి చెత్త, డంపింగ్ యార్డుల నిర్వహణ, హరితహారం మొక్కల సంరక్షణ, విద్యుత్ సమస్యల పరిష్కారం, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణపై పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రత్యేకాధికారులు పల్లె, పట్టణ వాసులకు అవగాహన కల్పిస్తారు.
తేదీల వారీగా కార్యక్రమాలు..
ముందుగా సర్పంచ్ అధ్యక్షతన వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శి, విద్యుత్‌శాఖ, మిషన్ భగీరథ సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేయాలి. సభ్యులందరికీ పల్లె ప్రగతి నివేదిక వినిపించాలి. శనివారం పంచాయతీలోని క్రీడామైదానాల పనులపై దృష్టి సారించారు. 5న ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో పారిశుధ్య చర్యలు. వాటిలో మొక్కలు నాటే కార్యక్రమం. ఇళ్లలో ఇంకుడు గుంతల నిర్మాణం. 6న గ్రామాల్లో పాడుబడిన బావుల పూడ్చివేత. హరితహారం మొక్కలు నాటేందుకు ప్రదేశాల గుర్తింపు. శిథిల భవనాల తొలగింపు. 7న సాగు నీటి కాలువలపై మొక్కలు నాటే కార్యక్రమం. బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు, హారితహారం మొక్కలకు గుంతలు తీయించడం.
8న తడి పొడి చెత్త నిర్వహణ, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, వాటిపై సమీక్ష. 9న హరితహారం మొక్కలకు నీరు పెట్డడం, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటడం, పల్లె ప్రకృతి వనాలపై సమీక్ష. ట్రీగార్డులు, ఊత కర్రల ఏర్పాటు. 10న డ్రై డే. ఇండ్లు, కార్యాలయాల్లో పారిశుధ్య చర్యలు. తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కార్యక్రమాలు. 11న నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో చెరువు గట్లు, కాలువ గట్లపై మొక్కలు నాటడం. 12న ఇంటి పన్ను చెల్లింపుపై గ్రామస్తులకు అవగాహన. 13న డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాల వద్ద విద్యుత్ సౌకర్యం ఏర్పాటు.
ఇతర సమస్యల పరిష్కారం. 14న పవర్ డే. గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారం. 15న గ్రామాల్లో శ్రమదానం. పిచ్చి మొక్కలు తొలగింపు. 16న వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులకు 100 శాతం బయో ఫెన్సింగ్ ఏర్పాటు. 17న వీధుల్లో నీటి నిల్వల తొలగింపు. ఇంకుడు గుంతల నిర్మాణం. కంపోస్ట్ ఎరువు తయారీపై అవగాహన. వ్యక్తిగత మరుగుదొడ్ల వాడకంపై అవగాహన. 18న గ్రామాల్లో గ్రామసభల నిర్వహణ. 3-18 వరకు నిర్వహించిన కార్యక్రమాల విజయాలపై నివేదిక. గ్రామసభల్లో ప్రకటన. పల్లె ప్రగతిలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి సన్మానం.