లక్ష్మీదేవిపల్లి/ కొత్తగూడెం టౌన్, జూన్ 4 : ధరణి భగభగ మండుతోంది. పర్యావరణ సమతుల్యతను కాపాడాలని వేడుకుంటోంది. ఇకనైనా మానవాళి మేల్కొనకపోతే భవిష్యత్తు అస్తవ్యస్తం అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో పర్యావరణ పరిరక్షణను ఒక భాగంగా చేసుకోవాలి. మనవంతు బాధ్యతగా కాలుష్యాన్ని, ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలి. మొక్కలను పెంచడాన్ని, పంచడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడే ముందు తరాలకు మంచి వాతావరణాన్ని అందించిన వాళ్లమవుతాం. వాతావరణంలో వస్తున్న మార్పులను గమనించిన ప్రపంచ దేశాలు పర్యావరణ పరిరక్షణ కోసం 1972 జూన్ 5న ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ రోజుగా ప్రకటించింది.
కాలుష్య కోరల్లో చిక్కుకొని..
నేడు అందరూ కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. జీవ వైవిద్యం విధ్వంసానికి గురవుతోంది. పర్యావరణ సమతుల్యత వల్ల అతివృష్టి, అనావృష్టి వంటివి చోటు చేసుకుంటున్నాయి. రుతువులు గతి తప్పుతున్నాయి. మొత్తం పంచ భూతాలు కూడా కాలుష్య నిలయాలుగా మారిపోయాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అడవులు, జీవజాతులు అంతరించిపోతున్నాయి. ప్రపంచం అనేక అనారోగ్య సమస్యలతో, వైరస్‌లతో కొట్టుమిట్టాడుతోంది. పర్యావరణం సక్రమంగా లేని కారణంగా మనుషుల్లో రోగ నిరోధక శక్తి కూడా క్షీణిస్తోంది. మేధావులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, వాతావరణ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యావరణ మార్పులను గమనిస్తూ పలు రూపాల్లో హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలూ చర్యలు తీసుకుంటున్నాయి. కానీ స్వీయ చర్యలు లేకపోతే కాలుష్య రహిత ప్రపంచాన్ని సృష్టించడం అసాధ్యం.
పరిరక్షణకు ఒక రోజు..
1972 జూన్ 5న ఐక్యరాజ్యసమితి పర్యావరణ పరిరక్షణ రోజును ఏర్పాటు చేసింది. మొదటిసారిగా ఈ రోజును 1973లో స్వీడన్లో నిర్వహించారు. అప్పటి నుంచి ఆ ఒక్కరోజు మాత్రమే ఈ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1970 దశకం నుంచి పర్యావరణ పరిరక్షణకు సరైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు ఉద్ఘాటిస్తూనే ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులు అనేక మంది ముంచుకొస్తున్న ముంపుపై వ్యాసాలు, నివేదికలు, డాక్యుమెంటరీల ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ సమతుల్యానికి కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ..
పర్యావరణ పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. మానవాళి మనుగడకు ప్రకృతి ఆధారమనే విషయాన్ని ప్రజలు గుర్తించేలా కార్యక్రమాలు చేపడుతోంది. అలాగే అంతరించిపోతున్న అడవులను కాపాడేందుకు ఎనిమిదేళ్లుగా అనేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో గతంలో కంటే అటవీ విస్తీర్ణం రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ పెరిగింది. అలాగే అంతరించిపోయాయనుకునే అనేక పక్షిజాతులు, జంతువులు తిరిగి అడవుల్లో సంచరిస్తున్నాయి. అలాగే వాతావరణ కాలుష్య నివారణకు మొక్కల పెంపకమే మార్గం. ఆ దిశగా అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హరితహారం పేరుతో ఏటా గ్రామాలు, అటవీ ప్రాంతాలు, ఇళ్లల్లో మొక్కలు నాటి సంరక్షించడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టింది. ఇప్పుడు పట్టణాల్లో కూడా రోడ్డుకు ఇరువైపులా పచ్చటి చెట్లు దర్శనమిస్తున్నాయి.
పర్యావరణ చట్టాలు…
స్వాతంత్య్రానికి పూర్వమే మన దేశంలో పర్యావరణ పరిరక్షణకు అనేక చట్టాలున్నాయి. మన భారత రాజ్యాంగం రూపకల్పనలోనే సహజ వనరుల రక్షణకు పెద్దపీట వేశారు. చుట్టూ ఉన్న పరిసరాలను కాపాడుకోవడం, సహజ పర్యావరణాన్ని రక్షించడం లాంటివి పౌరుల ప్రాథమిక విధి. దాని కోసం 1972లో వన్యప్రాణుల చట్టం, 2006లో అటవీ హక్కుల చట్టం, 1927లో భారతీయ అటవీ చట్టం, 1991లో పబ్లిక్ రిలయబులిటీ ఇన్సూరెన్స్ యాక్టు, 2002లో జీవవైవిధ్య చట్టం లాంటివి తీసుకొచ్చి పర్యావరణ రక్షణకు రాజ్యాంగం నిర్దేశించింది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 (ఏ) ప్రాథమిక విధులను నిర్వర్తిస్తుంది. అందులో పార్ట్ 4 (ఏ) ప్రకారం అ డవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహజ పర్యావరణాన్ని రక్షించడం, అభివృద్ధి చేయడం, జీవకారుణ్యం కలిగి ఉండడం దేశంలోని ప్రతి పౌరుడి విధి.
నేడు కొత్తగూడెంలో పర్యావరణ సదస్సు
పర్యావరణ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పర్యావరణ ప్రేమికులు ఆదివారం సదస్సును నిర్వహిస్తున్నారు. ఇందులో అధికారు లు, శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు పాల్గొననున్నారు.
726 రోజులుగా రోజుకో మొక్క..
గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా 726 రోజులుగా రోజుకో మొక్కను నాటుతూ పర్యావరణానికి ప్రాణం పోస్తున్నారు కొత్తగూడేనికి చెందిన మొక్కల రాజశేఖర్. వాటిని సంరక్షిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే, ఇదే కొత్తగూడేనికి చెందిన రాయి వెంకటయ్య కూడా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. 36ఏళ్లుగా 85లక్షల మొ క్కలను పెంచడం, ఉచితంగా పంచడం వంటి కార్యక్రమాలు చేపడుతుండడంతో మొక్కల వెంకటయ్యగా ఈ ప్రాంతంలో సుపరిచితమయ్యారాయన.