భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి పనులు శనివారం రెండో రోజుకు చేరుకున్నాయి. రెండోరోజు పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు డంపింగ్ యార్డుల నిర్వహణపై దృష్టి సారించారు. యార్డుల్లో వర్మీ కంపోస్టు తయారీ చేయాలని సిబ్బందికి అవగాహన కల్పించారు. కలెక్టర్ అనుదీప్ లక్ష్మీదేవిపల్లి పరిధిలోని బావోజీ తండా క్రీడాప్రాంగణం, పంచాయతీ నర్సరీని పరిశీలించారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు సుజాతనగర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మణుగూరు మండల కేంద్రంలో పట్టణ ప్రగతి పనులను ప్రారంభించారు. గుండాల మండలంలో భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పల్లె ప్రగతి పనులను పర్యవేక్షించారు. మండలాలు, గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారులు గ్రామస్తులకు ప్రగతి పనులపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలను కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తున్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటిస్తున్నారు.
కలెక్టర్ సమీక్ష..
పల్లె, పట్టణ ప్రగతి, మన బడి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ అనుదీప్ అదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారి పనులను పర్యవేక్షించాలని సూచించారు. మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నర్సరీల్లో మొక్కలు చనిపోకుండా ప్రతిరోజు నీరు పెట్టాలన్నారు.