ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 3 : బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా అడుగులేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం నానాటికీ పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సర్కారు బడుల బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ‘బడి బాట’కు శ్రీకారం చుట్టింది. ప్రైవేట్‌లోని వ్యతిరేకపరమైన అంశాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తూ బడిబాటను నిర్వహించనున్నాయి. ‘మన ఊరు – మన బడి’, ‘ఇంగ్లిష్ మీడియం బోధన’ వంటి అంశాల గురించి అవగాహన కల్పించనున్నారు. నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వ పాఠశాలలే ముందంజలో ఉంటాయనే నినాదంతో ఈ కార్యక్రమం కొనసాగనున్నది. ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు పది హేను రోజుల ముందుగానే ‘బడిబాట’ షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రజాప్రతినిధుల సహకారం..
తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ నమోదు కోసం ముందస్తుగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రకటించింది. ‘నమోదు – కొనసాగింపు – నాణ్యమైన విద్య’ ప్రధాన లక్ష్యాలుగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 3న ప్రారంభమైంది. 30 వరకు కొనసాగుతున్నది. ప్రజాప్రతినిధులను భాగస్వామ్యులను చేస్తూ బడిబాటను విజయవంతం చేయాలి. ఆవాస ప్రాంతాలన్నింటినీ సందర్శించి బడి ఈడు పిల్లలను గుర్తించాలి. ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యపై అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం, ఉచిత నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫాం వంటివన్నీ సమకూరుతాయని ఉపాధ్యాయులు వివరించాలి. స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులను ఇందులో భాగస్వామ్యం చేయాలి.
ప్రాధాన్యతాంశాలు..
ఈ నెల 13న ‘మన ఊరు/ మన బస్తీ – మన బడి’ కార్యక్రమాన్ని నిర్వహించాలి. 14న ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇంగ్లిష్ మీడియం విద్యపై, తెలుగు – ఇంగ్లిష్ భాషలు కలిసిన ద్విభాషా పుస్తకాలు అందిస్తున్న అంశాలపై అవగాహన కల్పించాలి. 15న పేరెంట్స్, టీచర్స్, 16న ఎస్ఎంసీ సభ్యులు, 17న ఎస్‌హెచ్‌జీ గ్రూపులతో సమావేశాలు నిర్వహించాలి. 18న బాలికా విద్య ఆవశ్యకతను వివరిస్తూ బడిబాట నిర్వహించాలి. కేజీబీవీల్లో కల్పిస్తున్న సదుపాయాల గురించి, పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థినుల ప్రతిభ గురించి వివరించాలి. 20న చదువు విశిష్టతను తెలియజేస్తూ సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలి. 21న పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛ పాఠశాల, 22న హరితహారం కార్యక్రమాలు నిర్వహించాలి. 23న ప్రత్యేక విద్యార్థుల నమోదు, 24న బాల సభ, 25న రీడింగ్ మేళా నిర్వహించాలి. 27న బడి బయట పిల్లల సర్వేలో గుర్తించిన విద్యార్థులను స్కూళ్లలో చేర్పించాలి. 28న బైలిగురల్ పుస్తకాలపై అవగాహన కల్పించాలి.29న డిజిటల్ ఎడ్యుకేషన్, 30న గణితం, సైన్స్ దినోత్సవర్యక్రమాలు నిర్వహించాలి.
ప్రధాన లక్ష్యాలు..
బడిబాటలో ప్రధానంగా మైదాన ప్రాంతాల్లోని విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించడంతోపాటు అన్ని ఆవాస ప్రాంతాల్లోని బడి ఈడు పిల్లలందరినీ గుర్తించి ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలి. వారి వివరాలు నమోదు చేయాలి.
ప్రభుత్వ పాఠశాలలున్న ప్రాంతాల్లోని అంగన్వాడీల్లో ఐదేళ్ల వయసు పూర్తి చేసుకున్న పిల్లల్ని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. అంగన్వాడీల్లోని విద్యార్థుల రికార్డుల ఆధారంగా వివరాలు నమోదు చేయాలి.
గ్రామ విద్యా రిజిస్టర్‌ను అప్డేట్ చేయాలి. అందుకు ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
ఒక తరగతి పూర్తి చేసుకున్న పిల్లలు అదే పాఠశాలలో లేదా వారికి దగ్గరలో ఉన్న మరో ప్రభుత్వ పాఠశాలలో అయినా తదుపరి తరగతుల్లో కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలి.
బడి బయట పిల్లలను గుర్తించినప్పుడు వారి వయసును ప్రామాణికంగా తీసుకుని సంబంధిత తరగతిలో చేర్పించాలి. వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
బడిబాటలో ఎన్రోల్మెంట్ పెంపొందించడంతోపాటు బాలికా విద్య ప్రాధాన్యాన్ని తెలియజేసి ప్రణాళికలు రూపొందించాలి.