కొత్తగూడెం కల్చరల్ జూన్ 3;భానుడు ఉగ్రరూపం దాల్చాడు. దీంతో ఎండలు భగభగ మండుతున్నాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయనే నానుడిని నిజం చేస్తూ దద్దరిల్లుతున్నాయి. ఈ నాలుగు నెలల ఎండాకాలంలో తొలిరోజుల్లో ఎండలు తక్కువగా ఉన్నప్పటికీ దినదిన ప్రవర్ధనమానంగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మామూలు ఎండల వేడినే తట్టుకోలేమంటే రోహిణిలో ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ పక్షం రోజుల్లో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. సింగరేణి కార్మిక ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతాలు కావడంతో జిల్లా కేంద్రం కొత్తగూడెంతోపాటు పాల్వంచ పట్టణం, మండలం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల్లో ఎండలు సుర్రుమంటున్నాయి.
44డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
వారంరోజులుగా జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలుగా నమోదవుతున్నాయి. తాజాగా శుక్రవారం 44డిగ్రీలకు చేరింది. దీంతో ఉదయం 7గంటల నుం చే ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. సాయం త్రం 6గంటల వరకు ఎండతాపం తగ్గడం లేదు. రాత్రి సమయంలో కూడా వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో జిల్లావాసులు తల్లడిల్లిపోతున్నారు. ఇంట్లో ఫ్యాన్, కూలర్ వేసుకున్నా సరే ఎండ తాపం తగ్గడం లేదని చాలామంది గ్రామాల్లో చెట్ల నీడను ఆశ్రయిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఇబ్బందులు పడుతున్నారు.
బొగ్గుగనుల వద్ద ఎక్కువే…
కొత్తగూడెం ఏరియాలోని బొగ్గుగనుల ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. గురు, శుక్రవారాల్లో సుమారు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏరియా అధికారులు తెలిపారు. దీంతో కార్మిక ప్రాంతాల్లోని ప్రజలు, కార్మిక కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. వడగాల్పులతో జనం విలవిల్లాడిపోతున్నారు. పగటివేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
అన్ని చర్యలు తీసుకుంటున్నాం
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో 43డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో కార్మికుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఏడాది మజ్జిగ పంపిణీ చేస్తున్నం. అన్ని గనులు, డిపార్ట్మెంట్లు, ఓసీల వద్ద ఉదయం, సాయంత్రం వాటర్ స్ప్రే చేస్తున్నాం. ఎండదెబ్బ తగలకుండా తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాం. ఓపెన్‌కాస్టు మైన్ల వద్ద చలువ పందిళ్లను ఏర్పాటు చేయించాం.
– సీహెచ్ నరసింహారావు, కొతగూడెం ఏరియా జీఎం