ఖమ్మం, జూన్ 3: పల్లె, పట్టణానికి ‘ప్రగతి’ పండుగొచ్చింది.. ఊరూవాడా సరికొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఇప్పటికే 4వ విడత పల్లె, 3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరో విడతకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం ప్రగతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గ్రామాలు, పట్టణాల్లోని పలు వార్డుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టారు.
కాలనీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించారు. మారుమూల అటవీ ప్రాంతం చర్ల మండలం పూసుగుప్ప, ఉంజవల్లి గ్రామాల్లో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్‌దత్ పర్యటించారు. ప్రజల మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కేశప్పగూడెం గ్రామాల్లో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీచైర్మన్ కోరం కనకయ్య పల్లె ప్రగతిలో పాల్గొన్నారు. – భద్రాద్రి కొత్తగూడెం, జూన్3 (నమస్తే తెలంగాణ)
పట్ణణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల సమగ్రాభివృద్ధి సాకారమవుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాలను స్వీయ నేతృత్వంలో బాగు చేసుకోవాలనే సంకల్పంతోనే తెలంగాణ ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి అజయ్‌కుమార్ శుక్రవారం ఉదయాన్నే సైకిల్‌పై నగరంలో పర్యటించారు. 37, 41, 52, 53 డివిజన్లలో ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య పనులను, రోడ్డుకు అడ్డుగా ఉన్న హ్యాండ్బోర్లు, విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. కాల్వ పక్కన చెత్త బాగా పెరిగి ఉండడాన్ని గమనించిన ఆయన.. స్వయంగా పార పట్టి దానిని తొలగించారు.
అనంతరం ఆయా డివిజన్లలో స్థానిక ప్రజలతో మాట్లాడారు. పట్టణ ప్రగతిలో ఇంకా చేపట్టాల్సిన పనులను గుర్తించేందుకు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులను పరిశీలించేందుకు సైకిల్‌పై పర్యటిస్తూ వచ్చినట్లు చెప్పారు. ప్రజా సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించడమే ఈ పర్యటన ఉద్దేశమని స్పష్టం చేశారు. నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి వివరించారు. అనంతరం పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఇందులో సిటీ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ ప్రతి డివిజన్‌లోనూ మూడు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డిఫ్యూటీ మేయర్ ఫాతిమా, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, దాదె అమృతమ్మ, నీరజ, పగడాల శ్రీవిద్య, బుర్రి వెంకట్‌కుమార్, సుడా డైరెక్టర్ ముక్తార్, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకుడు లింగాల రవికుమార్ పాల్గొన్నారు.