కొత్తగూడెం సింగరేణి, జూన్ 2 : సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబురాలు గురువారం ఘనంగా నిర్వహించారు. హెడ్డాఫీస్లో డైరెక్టర్ (పా) ఎన్ బలరాం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హెడ్డాఫీస్ నుంచి కొత్తగూడెం బస్టాండ్‌లోని అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డైరెక్టర్ (ఓపీ) చంద్రశేఖర్ జెండాఊపి ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్తమ ఉద్యోగులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కొత్తగూడెం ప్రకాశం మైదానంలో జరిగిన కార్యక్రమంలో సీఎండీ శ్రీధర్ సందేశాన్ని డైరెక్టర్ చంద్రశేఖర్ చదివి వినిపించారు.
సింగరేణి సంస్థ గడిచిన ఎనిమిదేళ్లలో అత్యద్భుతమైన వృద్ధిని సాధిస్తోందని, మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అగ్రగామి సంస్థగా సింగరేణి పేరు గడించిందన్నారు. తెలంగాణ రాకముందు 2013-14లో 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశామని, గతేడాది 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అంటే 29 శాతం వృద్ధి సాధించామన్నారు. ఉద్యోగాల కల్పనలో సింగరేణి సంస్థ ముందుందని, 2014 నుంచి ఇప్పటివరకు 18,287 మంది యువతకు ఉద్యోగాలు కల్పించామన్నారు. వీటిలో డిపెండెంట్లు, కారుణ్య నియామకాల కింద 13,879 మందికి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 4,428 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. ఇటీవల 665 ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి మెరిట్ జాబితాను ప్రకటించామని పేర్కొన్నారు. ప్రస్తుతం 1200 మెగావాట్ల ప్లాంట్‌కు అదనంగా మరో 800 మెగావాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఇటీవలే బోర్డు అంగీకారం తెలిపిందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాగానే ప్లాంట్ నిర్మాణం ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ప్లాంట్ పూర్తైతే సింగరేణి అందించే థర్మల్ విద్యుత్ 2 వేల మెగావాట్లకు చేరుతోందన్నారు. సత్తుపల్లి నుంచి రైల్వే మార్గం ద్వారా బొగ్గు ఉత్పత్తిని అతి తక్కువ సమయంలోనే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జీఎం పర్సనల్ బసవయ్య అధ్యక్షత వహించగా.. డైరెక్టర్ సత్యనారాయణరావు, జీఎం పర్సనల్ ఆనందరావు, జీఎం సీపీపీ నాగభూషణ్‌రెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకటరావు, సీఎంవోఏఐ అధ్యక్షుడు వీవీ మధుకర్, జీఎం పీపీ రవిప్రసాద్, జీఎం ఫైనాన్స్ సుబ్బారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.