భద్రాద్రి కొత్తగూడెం, మే 31(నమస్తే తెలంగాణ) : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు గ్రామాలు, మున్సిపాల్టీలకు కొత్తరూపు తీసుకొచ్చింది. యువ కలెక్టర్ అనుదీప్ ప్రగతిపై ప్రత్యేక దృష్టిసారించి గ్రామా లు, పురపాలికలను స్వచ్ఛత దిశగా నడిపిస్తున్నారు. అధికారు లు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తూ అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి అయ్యేలా చొరవ తీసుకుంటున్నారు. గతంలో డివైడర్లు, డ్రైనేజీ కాల్వలు లేక వెలవెలబోయిన వార్డులు నేడు పచ్చందాలతో కళకళలాడుతున్నాయి. ఏ మున్సిపాల్టీకి వెళ్లినా పూల మొక్కలు, సీసీ రహదారులతో సరికొత్త శోభను సంతరించుకున్నాయి. చెత్తాచెదారంతో కనిపించే పట్టణాలు నేడు స్వచ్ఛతతో స్వాగతం పలుకుతున్నాయి. కలెక్టర్ నిరంతరం పర్యవేక్షణ, సమీక్షలతో మున్సిపాలిటీల్లో అభివృద్ధిని వేగవంతం చేశారు. జి ల్లాలో నాలుగు మున్సిపాల్టీలు కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు అభివృద్ధిలో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.
కొత్తగూడెం ప్రగతికి రూ.9 కోట్లు
కొత్తగూడెం మున్సిపాల్టీ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. రామవరం ప్రాంతంలో ఎస్సీబీ నగర్ వర్షానికి ముంపునకు గురై అక్కడి కుటుంబాలు ఇబ్బందులు పడేది. అలాంటి ముంపు ప్రాంతానికి రూ.50 లక్షలు కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేయించారు. 36 వార్డులకు 36 చెత్త వాహనాలను వినియోగించి తడి,పొడి చెత్తను వేరుచేసి శుద్ధి మిషనరీ ద్వారా కంపోస్ట్ ఎరువుగా తయారీ చేస్తున్నారు. రూ.కోటితో తడి,పొడి చెత్త వ్యర్థాలను ఎరువుగా మార్చే కర్మాగారాన్ని అందుబాటులో ఉంచారు. ఏటా 5 టన్నుల ఎరువు ద్వారా రూ.5 లక్షల ఆదాయం వస్తున్నది. రూ.కోటి వ్యయంతో 11 ప్రాంతాల్లో స్వచ్ఛ మరుగుదొడ్లను నిర్మించారు. డివైడర్లలో పూల మొక్కలు, రహదారులకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో మున్సిపాలిటీ కొత్తరూపును సంతరించుకున్నది. పబ్లిక్ టాయ్లెట్స్ నిర్మాణాలు పూర్తి చేసి వాటి వినియోగంలోకి తీసుకొచ్చిన ఇల్లెందు మున్సిపాల్టీకి ఉత్తమ మున్సిపాల్టీగా అవార్డు అందుకున్నది.
ఇక్కడ 24 వార్డుల్లో విద్యుత్ సమస్యకు పరిష్కారం చూ పారు. పట్టణ ప్రగతి వనానికి రూ.30 లక్షలు, రహదారులు, డ్రై నేజీలకు రూ.10 లక్షలు, అవెన్యూప్లాంటేషన్కు రూ.30 లక్షలు, రైజింగ్ నర్సరీలకు రూ.5 లక్షలు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టారు. షాపింగ్ కాంప్లెక్స్, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని నిర్మించారు. ఇంటింటికీ చెత్తసేకరణకు రూ.90 లక్షలతో 20 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేశారు. పాల్వంచలో 25 వార్డుల్లో పట్ణణ ప్రగతి నిధుల ద్వారా అభివృద్ధి జరుగుతున్నది. రూ.5 కోట్లతో సీసీ రహదారులు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీలు నిర్మించారు. కొత్తగూడెం నుంచి పాల్వంచ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. మణుగూరు మున్సిపాలిటీలో 20 వార్డులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పాల్వంచ, ముణుగూరు రెండు మున్సిపాలిటీలకు పాలక మండళ్లు లేకపోవడంతో అధికారుల సమక్షంలో పనులు జరుగుతున్నాయి. మణుగూరులో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. అన్ని వార్డులకు పార్కులను ఏర్పాటు చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దారు.
ప్రభుత్వ లక్ష్యాలను సాధించాం
రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. పథకాలన్నీ అర్హుల దరిచేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. నాలుగు మున్సిపాలిటీలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తున్నాం. పల్లె, పట్టణాలన్నీ స్వచ్ఛతలో ముందంజలో ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మరింత ప్రగతి సాధించాలి. పట్టణాల్లోనూ శ్మశాన వాటికలను ఆధునీకరించాం. రహదారులపై డివైడర్లు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. పల్లె, పట్టణాల్లో కొత్త మైదానాలు ఏర్పాటు చేయబోతున్నాం. స్థలాల పరిశీలన పూర్తి అయ్యింది. 3 నుంచి పల్లె, పట్టణ ప్రగతి నిర్వహించనున్నాం
– అనుదీప్ కలెక్టర్ భద్రాద్రి