వేంసూరు, మే 27: ఆయిల్‌ఫెడ్ రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పట్టుదలతో ప్రయత్నించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. మండలంలోని కల్లూరుగూడెం గ్రామంలో 50 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆయిల్ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆయిల్‌ఫెడ్ సంస్థ ఆమోదం తెల్పడంతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి శుక్రవారం ఆ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయిల్‌ఫెడ్ చైర్మన్ మాట్లాడుతూ.. వేంసూరు మండలం కల్లూరుగూడెంలో నూతనంగా నిర్మించనున్న పామాయిల్ ఫ్యాక్టరీకి రెండు రోజుల్లో ఉత్తర్వులు అందిస్తే రెండేళ్లలో ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకురాగలమని అన్నారు.
ఫ్యాక్టరీ నిర్మాణానికి సుమారు రూ.150 కోట్లతో పనులు ప్రారంభిస్తామన్నారు. ఒక పామాయిల్ గింజ మొక్కగా మారాలంటే ఏడాదిన్నర సమయం పడుతుందని, డిమాండ్ పెరిగినందున రైతులకు మొక్కలు అందించే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో పామాయిల్ సాగుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకూ మొక్కలందించేలా కృషి చేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 8 జిల్లాలకు కావాల్సిన సుమారు 65 లక్షల మొక్కలను ఆయిల్‌ఫెడ్ ద్వారా పెంచుతున్నామన్నారు. వచ్చే ఏప్రిల్, మే నాటికల్లా 3 వేల ఎకరాలకు ఆయిల్‌ఫాం మొక్కల డిమాండ్ ఉందని, 6 వేల ఎకరాలకు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.
పామాయిల్ ఫ్యాక్టరీ నా అదృష్టం: సండ్ర
సీఎం కేసీఆర్ సహకారంతో సత్తుపల్లి నియోజకవర్గ రైతులకు తన హయాంలో పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో యువకులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని, చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. పామాయిల్ విత్తనం తయారు చేసే హక్కు మన రాష్ర్టానికి లేదని, మలేషియా, ఇండోనేషియా, కోస్టారికా దేశాలకు మాత్రమే ఉందని అన్నారు. విత్తనం తయారీ ఇబ్బందిగా ఉన్నందున దానిని అధిగమించేందుకు రాష్ట్రంలో నర్సరీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో ముందుకు వెళుతున్నామన్నారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల నర్సరీలో 4 లక్షల మొక్కలు పెంచుతున్నామన్నారు.
ఇబ్బందులు రాకుండా చూస్తాం: కలెక్టర్
కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ పామాయిల్ సాగుకు దరఖాస్తు చేసుకున్న రైతులకు మొక్కలు అందించే క్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మర్లపాడులో క్రీడాస్థలాన్ని పరిశీలించారు. ఆయిల్‌ఫెడ్ ఎండీ సురేందర్‌రెడ్డి, జిల్లా ఆయిల్‌ఫెడ్ అధికారులు అనసూర్య, అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ మేనేజర్ కల్యాణ్, ఆయిల్‌ఫెడ్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, ఇన్చార్జి తహసీల్దార్ రాగం ఎర్రయ్య, ఎంపీవో రంజిత్‌కుమార్, ఏవో రామ్మోహన్, ఉద్యాన శాఖ అధికారి మీనాక్షి, ఫారెస్టు అధికారులు, పీహెచ్సీ వైద్యురాలు పల్లవి, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, సర్పంచ్ కోలా వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ గొర్ల శ్రీనివాసరెడ్డి, సొసైటీల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.