కొత్తగూడెం లీగల్, మే 27: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో జిల్లా ప్రధాన కోర్టులను ఏర్పాటు చేయాలన్న నిర్ణయంలో భాగంగా కొత్తగూడెంలో జూన్ 2 నుంచి నూతన కోర్టులను ప్రారంభించనున్నట్లు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు తెలిపారు. కొత్తగూడెం కోర్టుల భవన సముదాయాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత కొత్తగూడెంలో జిల్లా ప్రధాన న్యాయస్థానాన్ని, తరువాత జిల్లా మొదటి అదనపు న్యాయస్థానాన్ని ప్రారంభించన్నుట్లు చెప్పారు. ఈ ఏర్పాటుకు కావాల్సిన వనరులన్నీ సమకూరాయని, కోర్టులకు సిబ్బంది నియామకం కూడా జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు మహ్మద్ అబ్దుల్ రఫీ, జకియా సుల్తానా, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ బాధ్యులు శరత్ షామీర్, బాగం మాధవరావు, సాధిక్పాషా, ఆర్తీ మక్కడ్, న్యాయవాదులు పాల్గొన్నారు.