ఖమ్మం వ్యవసాయం, మే 26: పచ్చదనం, పరిశుభ్రతతో పల్లెలు, పట్టణాలు వెల్లివిరియాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆకాంక్షించారు. ఇదే లక్ష్యంతో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అదేశాల మేరకు జూన్ 3 నుంచి 18 వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఖమ్మం ఖమ్మంలోని నూతన కేఎంసీ కౌన్సిల్ హాల్లో గురువారం నిర్వహించిన పట్టణ ప్రగతి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ప్రతి రోజూ పారిశుధ్య పనులు నిర్వహించాలని సూచించారు.
పదిహేను రోజుల పట్టణ ప్రగతిలో ఏయే పనులు, ఏయే రోజుల్లో ఏయే ప్రాధాన్య క్రమంలో చేపడతారో కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు విజయవంతం చేయాలని కోరారు. గత పట్టణ ప్రగతిలో నాటిన మొక్కలను సంరక్షిస్తూ మళ్లీ కొత్త మొక్కలు నాటేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. మొక్కలు నాటేందుకు ఇప్పుడే గుంతలు తీసి సిద్ధంగా ఉంచాలని, రెండేళ్ల వయసున్న మొక్కలను మాత్రమే నాటాలని సూచించారు. తొలకరి రాగానే మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని చట్టంలో ఉన్నందున అలక్ష్యానికి తావు ఇవ్వకూడదని సూచించారు.
ఖాళీ స్థలాలపై దృష్టి సారించాలి..
డివిజన్లలో ఖాళీగా స్థలాల్లో పిచ్చిమొక్కలు, మురుగు నిల్వలు ఉండడం వలన దోమలు, ఈగలకు ఆవాసమయ్యే ప్రమాదం ఉన్నందున ఆయా స్థలాల యజమానులకు నోటీసులు ఇచ్చి శుభ్రం చేయించాలని సూచించారు. స్పందించకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాగు చేసి ఖర్చుకు పదిరెట్లు అదనంగా అపరాద రుసుము వసూలు చేయాలని ఆదేశించారు. నిర్మాణ వ్యర్థాలను తొలగించి లోతైన ప్రాంతాల్లో వేయాలన్నారు. ఓపెన్ వెల్స్, బోర్ వెల్స్, హ్యాండ్ బోర్స్ వంటివి రోడ్లపై ఉండకూడా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రస్తుతం ఉన్న పాత మున్సిపల్ భవనాన్ని ఖమ్మం సిటీ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్స్, క్లాస్ రూమ్స్‌గా మార్చాలని సూచించారు. ప్రతి డివిజన్‌కూ ఒక అధికారిని నియమించాలని, అక్కడ జరగాల్సిన పనులన్నీ ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ప్రతి డివిజన్లో పబ్లిక్ టాయిలెట్స్ తప్పనిసరిగా ఉండాలని, వాటి నిర్వహణను కార్పొరేటర్లు పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి డివిజన్‌లోనూ క్రీడా ప్రాంగణం తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆక్రమణకు గురైన భూమిని విడిపించి క్రీడా ప్రాంగణాలకు కేటాయించాలన్నారు. ఖాళీ ప్రభుత్వ స్థలాలను శుభ్రం చేయించి రక్షణకు కాంపౌండ్ ఏర్పాటు చేయాలన్నారు.
ప్రమాదకర స్తంభాలు మార్చాలి
ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు స్తంభాలను మార్చాలని మంత్రి సూచించారు. గతంలో 208 ట్రాన్స్ఫార్మర్లు మార్చామని, 12,704 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశామని వివరించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజల విజ్ఞప్తి మేరకు మళ్లీ అవసరం ఉన్నచోట కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్ఎస్పీ క్యాంపులోని మిగులు భూమిని తక్షణం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భవిష్యత్ అవసరాలకు వినియోగిస్తుందని అన్నారు. ప్రజలకు, వాహనాలకు ఇబ్బంది లేకుండా డివిజన్ల సూచికలు, వీధుల పేర్లతో బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఉత్తమ డివిజన్లకు బహుమతులు
నగరంలోని 60 డివిజన్లలో 43 పట్ణణ ప్రగతి వనాలు ఉన్నాయని మంత్రి అన్నారు. ఈ విడతలో ప్రతి డివిజన్‌లోనూ పట్టణ ప్రగతి వనం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కార్పొరేటర్లకు సూచించారు. 60 డివిజన్లలో ఉత్తమ డివిజన్లను ఎంపిక చేస్తామని, మొత్తం ఆరు బహుమతులు అందిస్తామని అన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డివిజన్లకు మొదటి బహుమతిగా రూ.60 లక్షలు, రెండో బహుమతిగా రూ.50 లక్షలు, మూడో బహుమతిగా రూ.40 లక్షలు, నాలుగో బహుమతిగా రూ.30 లక్షలు, ఐదో బహుమతిగా రూ.20 లక్షలు, ఆరో బహుమతిగా రూ.10 లక్షల ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. వీటితోపాటు ఆయా కార్పొరేటర్లకు తాను స్వయంగా ఐఫోన్లను బహూకరించనున్నట్లు చెప్పారు.
నూతనోత్సాహంతో పనిచేయాలి: కలెక్టర్
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ ఈ విడత పట్టణ ప్రగతిని సక్సెస్ చేసేందుకు ప్రతి ఒక్కరూ నూతనోత్సాహంతో పనిచేయాలని సూచించారు. డివిజన్‌కు మూడు చొప్పున 60 డివిజన్లలో 180 క్రీడా ప్రాంగణాల ఏర్పాటు చేసేలా లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. జనాభా ప్రాతిపదికన పబ్లిక్ టాయిలెట్లను అందుబాటులోకి తెస్తామన్నారు. జూన్, జూలై నెలల లక్ష్యం మేరకు మొక్కలు నాటడం పూర్తి చేయాలన్నారు. కేఎంసీ మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కమిషనర్ ఆదర్శ్‌సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.