ఖమ్మం వ్యవసాయం, మే 26 :‘సంప్రదాయ పంటల సాగుకు స్వస్తి పలికి ఉద్యాన పంటల సాగు చేపడితే రైతులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. ఉద్యాన పంటలంటేనే దాదాపుగా స్వల్పకాలిక పంటలు. ఏటా మూడు నుంచి ఐదు రకాల పంటల సాగుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఆకు కూరలు, కూరగాయల సాగు చేపడితే రైతుకు ప్రతిరోజూ ఆదాయమే. దీర్ఘకాలిక పంటలకు చీడపీడల బెడద అధికం. పైగా సాగు నీరు, పెట్టుబడులు ఎక్కువ మొత్తంలో అవసరం. ఉద్యాన పంటలకు పెట్టుబడులు పెద్దగా అవసరం లేదు.
పైగా ప్రభుత్వమే రాయితీలు ఇస్తోంది’ అంటున్నారు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి జీ.అనసూయ. ప్రస్తుతం ప్రభుత్వం ఇతర పంటల సాగు చేపట్టాలని సూచిస్తున్న తరుణంలో ‘ఉద్యాన పంటల సాగు – ప్రయోజనాల’ను గురువారం ఆమె ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. రానున్న రోజుల్లో అదనంగా ప్రతి మండలంలోనూ 500 ఎకరాలల్లో ఆయిల్‌పాం సాగు జరిగే విధంగా కార్యాచరణ సిద్ధమైందని చెప్పారామె. దీంతో ఖమ్మం జిల్లా ఆయిల్‌పాం హబ్‌గా మారనుంది. ఇప్పటికే ఉద్యాన పంటల సాగుకు ఖమ్మం జిల్లా చిరునామాగా ఉంది. ఇతర పంటల సాగు ఎంపిక చేసుకునే రైతులకు ఆమె పలు సలహాలు,సూచనలు చేశారు.
నమస్తే తెలంగాణ : ప్రస్తుతం ఉద్యాన పంటల సాగు ఎలా జరుగుతోంది?
డీఎస్‌హెచ్‌వో: జిల్లాలో కొన్నేళ్లుగా ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఉద్యాన పంటల సాగుకు అవసరమైన దుబ్బ, ఎర్రనేలలు, నల్లరేగడి భూములు ఇక్కడ ఉన్నాయి. నీటి వనరులు సమృద్ధిగా ఉన్నాయి. దీంతో రైతులు ప్రత్యామ్నాయం దిశగా ఆలోచిస్తున్నారు. ఫలితంగా ఉద్యాన పంటల సాగు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం అన్ని రకాల పంటలు కలిసి జిల్లా వ్యాప్తంగా 1,95,489 ఎకరాల్లో సాగు ఉంది. వీటిలో ప్రధానంగా పండ్ల తోటలు 39,056 ఎకరాలు, కూరగాయలు 1,780 ఎకరాలు, మిర్చి, ఇతర పంటలు మరో 1,03 196 ఎకరాలు, తోటలు 9,171 ఎకరాలు, పూల తోటలు 46 ఎకరాలు, ఆగ్రో ఫారెస్ట్రీ 41,861 ఎకరాలు, బార్డర్ ప్లాంటేషన్ పంటల 158 ఎకరాలు, మామిడి 33,900 ఎకరాలు, మల్బరీ 98 ఎకరాలు, ఆయిల్‌పాం 8,067 ఎకరాల్లో సాగవుతున్నాయి.
నమస్తే : ఉద్యాన పంటలే ప్రత్యామ్నాయమా?
డీఎస్‌హెచ్‌వో : అవును. ప్రస్తుత పరిస్థితుల్లో వరి, మక్క పంటల కంటే ఉద్యాన పంటల సాగుతో రైతుకు అనేక ప్రయోజనాలున్నాయి. సంప్రదాయ పంటల సాగుతో పోల్చుకుంటే ఉద్యాన పంటల ద్వారా ఆశించిన లాభాలు పొందొచ్చు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటల సాగు చేసుకునేందుకు అవకాశముంది. కేవలం ఎకరం పొలంలో సుమారు 7 – 8 రకాల కూరగాయలు, ఆకు కూరల సాగు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. తక్కువ సమయంలో పంట చేతికి రావడంతో ఏడాదికి 3 – 4 రకాల పంటల సాగు చేసుకోవచ్చు. సొంతంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉండడం మరో ఉపయోగం.
నమస్తే : మార్కెటింగ్‌కు ఎలాంటి సౌకర్యాలున్నాయి?
డీఎస్‌హెచ్‌వో: పస్తుతం జిల్లా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఆయా రకాల పంటలు ఉత్పత్తి కావడం లేదు. ఉల్లి, ఆలుగడ్డ, పూలు, కొత్తిమీర వంటి పంట ఉత్పత్తులను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కూరగాయల సాగు మరింత పెరగాలి. ఆ లోటును పూడ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేశాం. ఖమ్మం శివారు మండలాల్లో కూరగాయల సాగు ఎక్కువగా ఉంది. మరింత సాగు చేపట్టినా మార్కెటింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
నమస్తే : ఉద్యాన పంటల సాగుకు ఎలాంటి రాయితీలున్నాయి?
డీఎస్‌హెచ్‌వో : మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన పంటల సాగు చేపట్టే రైతులకు ఉద్యానశాఖ ఆయా కేటగిరీల వారీగా రాయితీలు అందిస్తోంది. ప్రధానంగా సూక్ష్మనీటి పథకానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం రాయితీపై డ్రిప్ సౌకర్యం కల్పిస్తున్నాం. ఆయిల్‌పాం రైతులకు హెక్టార్‌కు మొదటి సంవత్సరం మొక్కలకు రూ.29 వేలు, ఎరువులకు రూ.5,250, అలాగే రెండు నుంచి నాలుగు ఏళ్లల్లో ఎరువులకు ఒక్కో ఏడాదికి రూ 5,250 చొప్పున రాయితీ అందుతుంది.
అంతర పంటలు సాగు చేసుకుంటే అదనంగా మరో రూ.5,250 రాయితీ కూడా వస్తుంది. సమగ్ర ఉద్యాన మిషన్ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకం కోసం మూడేళ్లకు గాను హెక్టారుకు రూ.30 వేల రూ.60 వేలకు వరకూ రాయితీ ఉంటుంది. వీటితోపాటు కోల్డ్‌స్టోరేజీలు, రైఫనింగ్ చాంబర్లు, మల్చింగ్, పందిళ్లసాగుకు సైతం సబ్సిడీలు అందిస్తున్నాం. పట్టుపరిశ్రమ సాగుకు అవసరమైన సహకారంతోపాటు మల్బరీ సాగుకు కోసం సిల్క్ సమగ్ర, ఎస్సీ, ఎస్టీ ప్లాన్, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాయితీలు అందుతాయి.