ఇల్లెందు రూరల్, మే 26: పల్లెలే దేశానికి పట్టుగొమ్మలన్నారు మహాత్ముడు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం పల్లెలను పట్టుగొమ్మలుగా తీర్చిదిద్దుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. చుట్టూ పచ్చదనంతో నిండిన ప్రకృతి వనాలు, చెత్తా చెదారం లేని పరిశుభ్రత, ఆహ్లదాన్ని పంచే రకరకాల పూలమొక్కల పరిమళాలు.. గ్రామ పంచాయితీల్లో సందర్శకులను కట్టి పడేస్తున్నాయి. కష్టజీవులు రోజంతా తాము పడిన కష్టాన్ని మరిచేలా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పొద్దంతా పనులకు వెళ్లి వచ్చిన గ్రామస్తులు.. సాయంత్రం వేళ సేదదీరేందుకు పల్లె ప్రకృతి వనాలకు క్యూ కడుతున్నారు.
ఇల్లెందు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. గతంలో పంచాయతీల్లో ప్రకృతి వనాలు అనే మాటేలేదు. కానీ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పాటయ్యాక కష్టజీవులతోపాటు పిల్లలు, వృద్ధులు, మహిళలు సేదదీరేందుకు సీఎం కేసీఆర్ ప్రకృతివనాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రతీ పల్లెల్లో ప్రకృతి వనాలు దర్శనమిస్తూ పల్లె ప్రజలను కట్టి పడేస్తున్నాయి. పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛమైన గాలి, రకరకాల పూలమొక్కలతో ఆహ్లాదం ఉట్టి పడుతోంది. దీనికి తోడు పిల్లలు ఆటలాడుకునేందుకు ఆట వస్తువులను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పిల్లలు వచ్చి ఆటలాడుకుంటున్నారు.
పచ్చదనంతో కొత్తదనం
ప్రకృతి వనాల చూట్టూ పచ్చదనాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా రకరకాల చెట్లు, మొక్కలతో కొత్తదనాన్ని పంచుతున్నాయి. కనుచూపుమేర ఆకుపచ్చగా దర్శనమిస్తుండడంతో ప్రజలు ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తున్నారు.
పరిశుభ్రతతో కళకళ
ప్రతిరోజూ ప్రకృతి వనాలు చెత్తా చెదారంలేకుండా పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. ఆయా పంచాయతీల సిబ్బంది ప్రకృతి వనాలను ప్రతి రోజూ శుభ్రం చేస్తున్నారు. పరిశుభ్రత, పచ్చగడ్డి ఉండడంతో సందర్శకుల తాకిడి పెరుగుతోంది.
పూల మొక్కలతో ఆహ్లదం
ప్రకృతివనాల్లో రకరకాల పూలమొక్కలు ఆహ్లదాన్ని పంచుతున్నాయి. ఏపుగా పెరిగి చూపుతిప్పుకోలేనంతగా కట్టి పడేస్తున్నాయి. ఎటువైపు వెళ్లినా పరిమళాలు గుబాళిస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులు, సందర్శకులు వీటిని ఆస్వాదిస్తున్నారు. ప్రకృతి వనమంతా కలియతిరుగుతూ పూల చెట్లను చూస్తే సంబురపడుతున్నారు. పిల్లలతో ఆటలాడుకుంటున్నారు.
చిన్నారుల కేరింతలు..
పల్లె ప్రకృతి వనాల్లో చిన్నారులు ఆడుకునేందుకు ఆటవస్తువులు ఉండడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జారుడు బంగ, రంగుల రాట్నాలు, కూర్చొని ఆడుకునే బెంచీలు వంటి వాటిపై ఆడుకుంటున్నారు. సాయంత్రమైతే ప్రకృతివనాల్లో చేరి సరదాగా ఆడుకుంటున్న పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.