ఖమ్మం, మే 24 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి):దేశాన్ని 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లలోనే చేసి చూపించారని, తెలంగాణకు స్వర్ణయుగాన్ని తెచ్చారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం రఘునాథపాలెం మండల కేంద్రంలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టే స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ భవన నిర్మాణం, కారేపల్లి మండలం రేలకాయలపల్లిలో నూతనంగా మంజూరైన ఏకలవ్య మోడల్ పాఠశాల భవన నిర్మాణ పనులకు వారు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములునాయక్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మ్ంరత్రి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చిపోయే ప్రతిపక్ష నాయకులు సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల్లాంటి వారని అన్నారు.
తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంటులో ఏనాడూ మాట్లాడని రేణుకమ్మకు సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం.. అభివృద్ధికి ఐకాన్‌గా నిలుస్తున్న దన్నారు. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ స్కాంలకు కేరాఫ్‌గా నిలిచిందని ఆరోపిం చారు.
స్వాతంత్య్రానంతరం 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు చేయలేని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం ఎనిమిదేళ్లలోనే చేసి చూపించారని, తెలంగాణకు స్వర్ణయుగాన్ని తెచ్చారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాలకు వచ్చిన ఆమె రఘునాథపాలెం మండలం కేంద్రంలో రూ.20 కోట్లతో నిర్మాణం చేపట్టే స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పురోగతి సాధించిందన్నారు. రఘునాథపాలెం ప్రధాన రోడ్డుకు ఆనుకొని 6 ఎకరాల సువిశాల ప్రాంగణంలో రూ.20 కోట్లతో నిర్మించే స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ భవనం రానున్న రోజుల్లో దేశానికి భావి పౌరులను తీర్చిదిద్దేందుకు మంచి వేదిక కావాలిన ఆకాంక్షించారు.
దీని ద్వారా విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, ఎన్ఐటీ, నీట్ వంటి కోర్సు ల్లో శిక్షణ అందించి ఆయా విద్యాసంస్థల్లో సీట్లు సాధించే అవకాశాన్ని కల్పించనున్నట్లు చెప్పారు. స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ భవనం ఇప్పటి వరకూ రాష్ట్రంలో కేవలం హైదరాబాద్‌లోనే ఉందని, ఇప్పుడు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని నిర్మించేది రెండోదని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చిపోయేవారు ప్రతిపక్ష నాయకులు సంక్రాంతి సమయంలో కనిపించే గంగిరెద్దుల్లాంటి వారని అన్నారు. గిరిజన వైద్యుడికి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసి అతడి కుటుంబాన్ని వీధి పాలు చేసిన రేణుకాచౌదరికి జిల్లాలో తిరిగే హక్కే లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంటులో ఏనాడూ మాట్లాడని రేణుకమ్మకు ఇప్పుడు సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. ఆ దొంగకు రాష్ర్టాన్ని పాలించే హక్కే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రఘునాథపాలెం మండలంలో నూతనంగా ఏర్పటైన 19 గిరిజన పంచాయతీల్లో భవన నిర్మాణాలకు వారం రోజుల్లో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె గిరిజన భాషలో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. ఆ సమయంలో గిరిజనులు సైతం చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు.
అభివృద్ధికి ఐకాన్: మంత్రి అజయ్
తెలంగాణ రాష్ట్రం.. అభివృద్ధికి ఐకాన్‌గా నిలుస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ స్కాంలకు కేరాఫ్‌గా నిలిచిందని ఆ రోపించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్‌లోకి అడుగుపెట్టగానే రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు. అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారని, త్వరలోనే ఆయన చేతుల మీదుగా దానికి శంకుస్థాపన చేస్తామని అన్నారు.
తెలంగాణ బంగారుమయం: ఎంపీ నామా
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ బంగారుమయం అవుతోందన్నారు. ప్రతిపక్ష నాయకులు సైబీరియన్ పక్షుల్లా వచ్చి ఖమ్మం జిల్లా అభివృద్ధిపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లా ప్రజలు వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్, ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆర్జేసీ కృష్ణ, మాళోతు ప్రియాంక, మద్దినేని వెంకటరమణ, అజ్మీరా వీరూనాయక్, బానోతు ప్రమీల, కుర్రా భాస్కర్‌రావు, పగడాల నాగరాజు, గుడిపుడి శారద, భుక్యా లక్ష్మణ్‌నాయక్, గుడిపుడి రామారావు, మెంటెం రామారావు, నున్నా శ్రీనివాసరావు, జంగాల శ్రీను, తొలుపునూరి దానయ్య తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులపై బీజేపీది కపట ప్రేమ
గిరిజనులపై బీజేపీది కపట ప్రేమని మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లిలో నూతనంగా మంజూరైన ఏకలవ్య మోడల్ పాఠశాల భవన నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములునాయక్‌లతో కలిసి మంగళవారం ఆమె భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల మీద ప్రేమ ఉందని చెప్పుకునే కేంద్రంలోని బీజేపీ పెద్దలు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని, ములుగులో గిరిజన యూనివర్సిటీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదని విమర్శించారు.
గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక నిధులతో ఖమ్మం జిల్లాలో రూ.250 కోట్లతో రహదారులు నిర్మించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా సింగరేణి మండలంలో రూ.25 లక్షలతో నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామ పంచాయతీలో భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతమైన రేలకాయలపల్లికు ఏకలవ్య మోడల్ పాఠశాల మంజూరు కావడం జిల్లాకు దక్కిన అరుదైన గౌరవమని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ముత్యాల సత్యనారాయణ, మాలోత్ శకుంతల, వాంకుడోత్ జగన్, తోటకూరి రాంబాబు, అజ్మీరా వీరన్న, మల్లేల నాగేశ్వరరావు, దుగ్గినేని శ్రీనివాసరావు, రావూరి శ్రీనివాసరావు, గుగులోత్ శ్రీను, భూక్య రమణ, శంకర్, అధికారులు పాల్గొన్నారు.