చింతకాని, మే 24: దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో పెనుమార్పులు సంభవించనున్నాయని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. దేశంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. మండలంలో తిర్లాపురం, సీతంపేట తదితర గ్రామాల్లో దళితబంధు యూనిట్లయిన జేసీబీ, హార్వెస్టర్లను స్థానిక మండలాధికారులతో కలిసి మంగళవారం ఆయన లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు.
75 ఏళ్ల స్వతంత్య్ర భారతంలో దళితుల కోసం ఇలాంటి పథకం ఏ ఒక్కటీ రాలేదని అన్నారు. ఏ ముఖ్యమంత్రీ చేయని పనిని సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారని కొనియడారు. దళితుల సాధికారిత సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. దళితబంధు పథకం దేశానికే దిక్సూచిలా నిలుస్తుందని ఆకాంక్షించారు. దళితులంతా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా నిలవాలని కోరారు. అనంతరం ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు.