టేకులపల్లి, మే 24 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌యార్డు, సెగ్రిగేషన్ షెడ్, ట్రాక్టర్, వైకుంఠధామాలు ఏర్పాటు చేయడంతో తెలంగాణ పల్లెలు అభివృద్ధికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అన్న నానుడిని నిజం చేస్తున్న సీఎం కేసీఆర్ అన్ని మౌలిక వసతులు కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చారు. మురికి వాడలుగా ఉన్న వీధుల్లో పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపడుతుండడంతో పారిశుధ్యం మెరుగుపడింది. ప్రస్తుతం ప్రతి గ్రామ పంచాయతీ అన్ని హంగులు సంతరించుకున్నాయి. ఇదే బాటలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం ప్రేగళ్లపాడు గ్రామ పంచాయతీ దూసుకుపోతున్నది.
ప్రేగళ్ళపాడు పంచాయతీలో పడమటి గుంపు, దుబ్బతండా, తెలుగురు, తూర్పుగూడెం గ్రామాలున్నాయి. మొత్తం జనాభా 2,400మంది.. ఓటర్లు 1,820 మంది ఉన్నారు. పంచాయతీలో 485ఇండ్లు ఉండగా వాటిలో 418మరుగుదొడ్లు నిర్మించారు. అలాగే ప్రతి ఇంటికి ఇంకుడుగుంత ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించి, ఇంటిలో మురికి నీటి నిల్వలు లేకుండా ఇంకుడుగుంతలు, గ్రామాల్లో ప్రతి వీధిలో ఏర్పాటు చేసిన బోరింగ్ల వద్ద సామూహిక(కమ్యూనిటీ ఇంకుడుగుంతలు) ఇంకుడుగుంత నిర్మించారు. ప్రస్తుతం 200ఇంకుడుగుంతలు పూర్తి చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హరితహారంలో 7,300 మొక్కలు
గ్రామ పంచాయతీలో రోడ్డుకిరువైపులా మూడు కిలోమీటర్ల పరిధిలో అవెన్యు ప్లాంటేషన్ కింద 1,200 మొక్కలను నాటించారు. రూ.లక్షా 80వేలతో ప్రతి మొక్కకూ ట్రీగార్డు ఏర్పాటు చేశారు. హరితహారంలో నాటిన మొక్కలు 95శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకున్నారు. పంచాయతీలో ప్రతి ఇంటికి 6మొక్కల చొప్పున మొత్తం 3,000 మొక్కలు నాటించి గ్రామాన్ని పచ్చదనంతో హరితతోరణంగా మార్చారు. గ్రామ పంచాయతీలోని నాలుగు పల్లెప్రకృతి వనాల్లో నాలుగు ఎకరాల భూమిలో 4,000 మొక్కలు నాటి 4లక్షల 10వేల వ్యయంతో పార్కుల చుట్టూ కాంపౌండ్, బోరుమోటర్తో నీటి సౌకర్యం, నర్సరీలో 16,000 మొక్కలు పెంచేందుకు రూ.42 వేలు ఖర్చు చేశారు.
ప్రభుత్వం సాయంతో ట్రాక్టర్, ట్యాంకర్
గతంలో పంచాయతీలో చెత్త పేరుకుపోయినప్పుడు పంచాయతీ సిబ్బంది దానిని తీసుకెళ్లుటకు వాహనాలు లేక ఇబ్బంది పడేవారు, అలాగే హరితహారంలో నాటిన మొక్కలకు నీరులేక ఇబ్బందులు పడేవారు.. కానీ ఇప్పుడు ప్రభుత్వ సాయంతో రూ.7లక్షల 50వేలతో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రక్కులను సమకూర్చడంతో ఆ బాధలు తప్పాయి. మొక్కలకు నీళ్లు పోసేందుకు వాటర్‌ట్యాంక్, చెత్తను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్ ట్రక్కు ఉపయోగపడుతున్నాయి.
రైతువేదిక, డంపింగ్షెడ్, వర్మీకంపోస్టు తయారీ
గ్రామంలో రూ.22 లక్షలతో రైతువేదిక, 10లక్షలతో సీసీ రోడ్డు, 12లక్షల 50వేలతో శ్మశానవాటిక, 2లక్షల 50వేలతో డంపింగ్షెడ్ నిర్మించారు. ప్రతి అభివృద్ధి పనుల వద్ద అందమైన మొక్కల పెంపకం, శ్మశానవాటిక చుట్టూ 380 మొక్కలు పెంచి మంచి వాతావరణం ఏర్పాటు చేశారు.
గ్రామాభివృద్ధికి దాతల సహకారం
గ్రామ పంచాయతీలో జరిగే పలు అభివృద్ధి పనులకు లక్కినేని వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు సాయం చేశారు. రైతువేదిక, పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికకు కలిపి మొత్తం నాలుగు ఎకరాల భూమిని వితరణగా ఇచ్చారు.
కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. ఏ గ్రామానికి వెళ్లి చూసినా గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. బంగారు తెలంగాణ గ్రామాలతోనే ప్రారంభమైయిందని చెప్పవచ్చు. స్థిరమైన పనులతో గ్రామాలు కనిపిస్తున్నాయి.
– లక్కినేని శ్యామ్‌బాబు, గ్రామ పెద్ద, ప్రేగళ్ళపాడు