ఖమ్మం ఎడ్యుకేషన్, మే 12 : ఈనాటి విద్యార్థులే రేపటి తరాలకు చరిత్రను అందించే రచయితలని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలో తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు – చరిత్ర ఐక్యూఏసీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘మన ఊరు – మన చరిత్ర’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. విద్యార్థులు తమ ఊరి గురించి, భౌగోళిక విశిష్టతలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాల గురించి తెలుసుకోవాలని సూచించారు. ఊరు ఎప్పుడు పుట్టిందో, ఎలా రూపాంతరం చెందిందో పరిశోధనాత్మకంగా తెలుసుకోవాలని సూచించారు.
తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరుల గురించి ఇప్పటి వరకూ చరిత్రకారులకు దొరకని అంశాలను, వీర తెలంగాణ సాయుధ పోరాట ఘట్టాలను రికార్డు చేయాలని సూచించారు. ప్రతి ఊరిలోనూ స్తూపాలుంటాయని, వాటికి ఎన్నో గాథలు ఉంటాయని అన్నారు. వాటి గురించి తెలుసుకున్నప్పుడు చరిత్ర ఏంటో బోధపడుతుందని అన్నారు. తెలంగాణ సిద్ధించాక గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, గ్రామీణులు, వృత్తిదారుల జీవితాల్లో వచ్చిన మార్పులు వంటి వాటి గురించి కూర్చి ఇష్టంగా రచనలు చేయాలని సూచించారు. అధ్యాపకులు జూమ్ ద్వారా గైడ్ చేస్తారని, ప్రభుత్వ అధికారులు కూడా కావాల్సిన సమాచారం అందిస్తారని అన్నారు. అందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఉత్తమ గ్రంథాలను వెలువరిస్తుందని పేర్కొన్నారు.
టాక్స్ కలెక్టర్.. కలెక్టర్‌గా మారింది..
కలెక్టర్ అనే పదం వచ్చి 250 సంవత్సరాలు పూర్తయిందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ గుర్తుచేశారు. అప్పట్లో పన్నులు వసూలు చేయడానికి టాక్స్ కలెక్టర్ ఉండేవారని, తర్వాత ప్రభుత్వాలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరేందుకు అన్ని విభాగాలూ వచ్చాయని అన్నారు. అప్పటి టాక్స్ కలెక్టర్‌నే ఇప్పుడు కలెక్టర్‌గా మార్చారని అన్నారు. జిల్లా మన చరిత్రను మనం తెలుసుకోకపోతే మన ఉనికిని కోల్పోయినట్లేనని విద్యార్థులకు సూచించారు. క్షేత్రస్థాయి చరిత్రే నిజమైన చరిత్ర అని అభివర్ణించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తీసుకున్న చొరవ వల్ల చరిత్ర రూపంతోపాటు ప్రజాస్వామిక చరిత్రను తెలుసుకోవచ్చని అన్నారు.
అంతకుముందు ప్రిన్సిపాల్ జాకీరుల్లా కార్యక్రమ ప్రాధాన్యాన్ని వివరించారు. తెలంగాణ వచ్చాక మన సంస్కృతి గురించి అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు. అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ రూపొందించిన త్రైమాసిక పత్రిక ‘పునాస’ను, తెలుగు విభాగం ప్రచురించిన వైవిద్య గ్రంథాన్ని, పొలిటికల్ సైన్స్ విభాగం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పుస్తకాన్ని అతిథులు, వక్తలు ఆవిష్కరించారు. ఎంపిక చేసిన విద్యార్థులకు నమోదు పత్రాలను అందజేశారు. తెలుగు శాఖాధిపతి డాక్టర్ జరుపుల రమేశ్, చరిత్ర శాఖ అధిపతి నాగూర్, కార్యక్రమ సమన్వయకర్త సీనియర్ తెలుగు అధ్యాపకులు, కవి, కేయూ పాలక మండలి సభ్యులు డాక్టర్ సీతారాం, ఐక్యూఏసీ సమన్వయకర్త సత్యవతి, వెంకటేశ్వరరెడ్డి, చంద్రమోహన్, రమణ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.