అశ్వారావుపేట/ అశ్వారావుపేట టౌన్, మే 8: రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలను సాగు చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. యావత్ తెలంగాణ నిత్యం పచ్చదనంతో పరిమళించాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకోసం రాష్ట్రంలో హరితహారం ద్వారా 270 కోట్ల మొక్కలను నాటి వాటిని బతికించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ ఏడాది 230 కోట్ల మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని, మిగిలిన లక్ష్యాన్ని కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలిపిన పథకాల్లో హరితహారం ప్రధానమైనదని అన్నారు. రాష్ట్రంలో పామాయిల్ సాగుకు మంచి భవిష్యత్తు ఉందన్నారు.
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని అటవీశాఖ నర్సరీని, ఇక్కడి పామాయిల్ తోటలను 300 మంది నిర్మల్ జిల్లా రైతులతో ఆదివారం సందర్శించారు. పామాయిల్ సాగు ప్రాముఖ్యత, దిగుబడి, సాగు విధానాలపై అశ్వారావుపేట ఆయిల్‌పాం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అటవీశాఖ నర్సరీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి ఇంద్రకరుణరెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని 16 రాష్ర్టాల్లో విద్యుత్ కొరత ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మాత్రం రైతులకు 24 గంటలూ విద్యుత్‌ను అందిస్తూ అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పచ్చని మొక్కలను పంపిణీ చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా 12,750 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇంతకు ముందు 25 శాతంగా ఉన్న అడవులను ప్రస్తుతం 4.17 శాతం అదనం విస్తరింపజేశామని, 33 శాతం అడవులను విస్తరింపజేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, భీమానాయక్, లక్ష్మణ్ రంజిత్‌నాయక్, తిరుమలరావు, జీనుగు మరియన్న, అబ్దుల్ రెహమాన్, శ్రీనివాసరావు, ఆకుల బాలకృష్ణ, వలపర్ల ఉదయ్‌కుమార్, కల్యాణ్ పాల్గొన్నారు.
పామాయిల్ సాగు మెళకువలు తెలుసుకునేందుకు వచ్చా..
దమ్మపేట, మే 8: తెలంగాణలో రైతుల సాగు, తాగునీటికి ఢోకాలేదని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం దమ్మపేట, అశ్వారావుపేట మండలాల పర్యటనలో భాగంగా అల్లిపల్లిలో పామాయిల్ తోటలను, అప్పారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడంతోపాటు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సుమారు 36 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారని అన్నారు. మన ప్రాంతంలోనూ పామాయిల్‌ను పండించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని అన్నారు.
ప్రస్తుతం పామాయిల్ టన్ను ధర రూ.22,700 ఉందని, యావరేజ్‌గా ఎకరానికి 12 నుంచి 16 టన్నుల వరకు పంట దిగుబడి వస్తుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకరానికి రూ.1.75 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రైతుకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని వివరించారు. దమ్మపేటలోని అప్పారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీని చూసేందుకు వచ్చామన్నారు. ఇక్కడి పామాయిల్ రైతులను కలుసుకొని సాగు వివరాలు తెలుసుకునేందుకు నిర్మల్ నుంచి సుమారు 300 మంది రైతులతో కలిసి ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే తాను 10 ఎకరాల్లో పామాయిల్ సాగుచేస్తున్నానన్నారు. సత్తుపల్లితో పాటు ఈ ప్రాంత ఏజెన్సీ రైతులు కష్టజీవులని మంత్రి అల్లోల కితాబిచ్చారు.
ఎమ్మెల్యేగా మెచ్చా నాగేశ్వరరావు ప్రాతినిథ్యం వహించడంతో ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతోందన్నారు. అనంతరం ఫ్యాక్టరీలో కలియతిరిగి పామాయిల్ ఉత్పత్తి, ప్రాసిసెంట్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పామాయిల్ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం అల్లిపల్లిలోని రాష్ట్ర పామాయిల్ రైతుసంఘం అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్ పామాయిల్ తోటను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పామాయిల్ తోటను కలియతిరిగి తోటలో పామాయిల్ చెట్లకు కాసిన గెలలను పరిశీలించారు.
ఇక్కడి సాగు వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని రైతులకు అవగాహన కల్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు రంగాప్రసాద్, మరియన్న, ఉదయ్‌కుమార్, కల్యాణ్, శ్రీనివాసరావు, ఆలపాటి రామచంద్రప్రసాద్, పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, దారా యుగంధర్, రావు జోగేశ్వరరావు, రావు గంగాధర్‌రావు, ఎల్లిన రాఘవరావు, ఎర్రగొర్ల రాధాకృష్ణ, యార్లగడ్డ బాబు, అంకత ఉమామహేశ్వరరావు, సోయం ప్రసాద్, దారా మల్లికార్జునరావు, కేదాసి వెంకటసత్యనారాయణ పాల్గొన్నారు.